
Chandrababu- Jagan: ఎన్నికల్లో లాభం చేకూర్చే ఏ అంశాన్ని రాజకీయ పక్షాలు జారవిడుచుకోవు. గత ఎన్నికల ముందు చంద్రబాబుకు చాలా అంశాలు ఇబ్బందిపెట్టాయి. అందులో ప్రధానమైనది ప్రత్యేక హోదా. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ ప్రత్యేక హోదా నినాదంతోనే ప్రజల్లోకి బలంగా వెళ్లారు. రాష్ట్ర భవిష్యత్ కు ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవిని అంటూ ఊరూ వాడా ప్రచారం చేశారు. దాంతోనే రాష్ట్ర యువత భవిత సాధ్యమని కూడా తేల్చిచెప్పారు. దీంతో జగన్ మాటలను ప్రజలు విశ్వసించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ఫెయిలయ్యారని జగన్ చేసిన ఆరోపణలను ప్రజలు కూడా నమ్మారు. అందుకే చంద్రబాబు నుంచి అధికారాన్ని జగన్ కు అప్పగించారు. అంతులేని విజయాన్ని కట్టబెట్టారు.
ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. జగన్ సర్కారు నిర్ణయాల నుంచి విధానాల వరకూ తప్పుపడుతున్నాయి. ప్రజల మధ్య ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను, వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో వచ్చిన విభేదాల పుణ్యమే చంద్రబాబు ఎన్టీఏ నుంచి బయటకు రావడం. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబును పొమ్మనలేదు. అలాగని చంద్రబాబు స్వచ్ఛందంగా వెనక్కి రాలేదు.కేవలం జగన్ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఎన్డీఏకు దూరం కావాల్సి వచ్చింది. ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

అయితే గతంలో జగన్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు చంద్రబాబు అమలుచేయాలని చూస్తున్నారు. ఎన్నికలు సమీపించేసరికి ప్రత్యేక హోదాను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. నాడు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ హామీని గుర్తుచేస్తున్నారు. వైసీపీ నేతల్ని ప్రత్యేక హోదాపై నిలదీయాలని టీడీపీ నేత నారా లోకేష్ తన పాదయాత్రలో కోరుతున్నారు. పాతిక మంది ఎంపీల్ని ఇస్తే హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు 31 మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ కలిపి) ఉన్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో కసరత్తు చేస్తోంది.
నాడు జగన్ మాటలు నమ్మి అంతులేని విజయాన్ని కట్టబెడితే కేంద్రం ముందు ఏమీ మాట్లాడలేకపోతున్నారని రాష్ట్రంలో ఒక సెక్షన్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అటు విద్యార్థులు, యువతలో అభిప్రాయం బలంగా ఉన్న తరుణంలో ఇదో ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. అందుకే లోకేష్ పాదయాత్రలో పదేపదే ప్రత్యేక హోదా ప్రస్తావననే తీసుకొస్తున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనమని కేంద్రం చెబుతూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం సైతం రాజకీయ అవసరాల దృష్ట్యా సైలెంట్ అయ్యింది. కానీ పార్లమెంట్ లో మాత్రం విజయసాయిరెడ్డి వారు ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచగలుగుతున్నారు. టీడీపీ హైజాక్ చేయకుండా ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం వైసీపీ ప్రభుత్వంపై అనుమానాలున్నాయి. అందుకే నాడు జగన్ ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని రాజకీయంగా దెబ్బకొట్టారో.. అదే ఫార్ములాను చంద్రబాబు అనుసరిస్తున్నారు.