Chadrababu – Jagan : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు.. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు.. వచ్చిన ఎన్నికల్లో దాదాపు 86 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. అందుకు కారణం వారిపై ప్రజా వ్యతిరేకత ఉండటమే. ఈ నిర్ణయం తీసుకుంది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాలం గడిచిపోయింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి దాదాపుగా కనుమరుగయ్యింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన.. తన ప్రభుత్వంలోకి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టిడిపి చరిత్రలోనే కనివిని ఎరుగని ఓటమిని ఆయన రుచి చూశారు. ఐదేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఐదు సంవత్సరాలు అధికార పార్టీగా వెలుగొందిన వైసిపి.. ఎన్నికల ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే చాలా వరకు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చేస్తోంది.
గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే లందరికీ టికెట్లు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఏనాడూ చెప్పలేదు. పైగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లల్లో మంత్రివర్గంలో తీసుకున్న వారందరికీ రెండున్నర సంవత్సరాలు పూర్తికాగానే ఉద్వాసన పలికారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మరొకసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు. సహజంగా ఇది అధికార పార్టీకి మింగుడు పడని విషయం అయినప్పటికీ తప్పడం లేదని ఆ పార్టీ నాయకులంటున్నారు. టికెట్ రాదు అని తెలిసినవారు టిడిపిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఎమ్మెల్యేల మార్పు ప్రక్రియను అక్కడి ప్రతిపక్ష టీడీపీ ఖండిస్తోంది. ఆ పార్టీకి వంత పాడే మీడియా కూడా తప్పుపడుతోంది. అయితే ఇదే సమయంలో అక్కడ వైసిపి నాయకులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి చెందిన చంద్రబాబు నాయుడు కుప్పం ఎందుకు వెళ్ళిపోయారు? చంద్రగిరి నుంచి పోటీ చేయవచ్చు కదా? పాయకరావుపేటలో పోటీచేసిన అనిత కొవ్వూరుకు ఎందుకు తన అసెంబ్లీ స్థానాన్ని మార్చుకున్నారు? భీమిలి స్థానం నుంచి పోటీ చేద్దాం అనుకున్న ఓ టిడిపి నాయకుడు విశాఖపట్నం నార్త్ కు ఎందుకు వెళ్లిపోయారు? తన సొంత నియోజకవర్గం అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు భీమిలి స్థానం నుంచి ఎందుకు పోటీ చేయాలి అనుకుంటున్నారు? అంతేకాదు తన స్వస్థలమైన గుడివాడలో పోటీ చేయకుండా బాలకృష్ణ బీసీలు అధికంగా ఉండే హిందూపురంలో ఎందుకు పోటీ చేస్తున్నారు? ఆయన కూడా గుడివాడ నుంచి పోటీ చేయవచ్చు కదా? 2014లో గుడివాడ స్థానం నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు కాదని, 2024 లో ఎవరో ఎన్నారైని గుడివాడ స్థానంలో ఎందుకు పోటీ చేయిస్తున్నారు? మంగళగిరికి లోకేష్ కు ఏమిటి సంబంధం? ఆయన తన తాత ఎన్టీఆర్ అని చెప్పుకుంటాడు కదా? అలాంటి వ్యక్తి గుడివాడ నుంచి పోటీ చేయవచ్చు కదా? అంటూ వైసిపి నాయకులు టిడిపి నాయకులను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీ అయినా గెలుపు కోసమే పనిచేస్తుందని, ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను కచ్చితంగా వదిలించుకుంటుందని గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పు ఏమీ చేయడం లేదని, కానీ దీనిని టిడిపి నాయకులు ఏదో జరిగిపోతోంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నారు. మొత్తానికి అటు వైసిపి, టిడిపి నాయకుల విమర్శ ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం ఎన్నికలకు ముందే ఒక్కసారిగా వేడెక్కింది.