TDP – Chandrababu : మారిన చంద్రబాబు లెక్క

అందుకే అటువంటి అవకాశం ఇవ్వకుండా.. కుటుంబానికి ఒకటే టికెట్ అని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. దీంతో సీనియర్లకు ఇది మింగుడు పడని విషయంగా మారింది.

Written By: NARESH, Updated On : February 12, 2024 3:57 pm

Chandrababu

Follow us on

TDP – Chandrababu : తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. మధ్యలో కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్ళినా.. తిరిగి వచ్చేసిన వారు ఉన్నారు. దాదాపు ఆరుపదుల వయసు దాటిన నేతలంతా ఎన్నికల్లో చివరి అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరుతున్నారు. మరోవైపు తమ వారసులను పోటీ చేయించాలని చూస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ 10 కుటుంబాలు రెండు టిక్కెట్లు చొప్పున ఆశిస్తున్నాయి. కానీ అది కుదిరే పని కాదని చంద్రబాబు తేల్చేస్తున్నారు. కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమేనని తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో కింజరాపు ఎర్రం నాయుడు కుటుంబానికి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు. దీంతో సూపర్ సీనియర్ నేతలంతా బాధతో ఉన్నారు.

తెలుగుదేశం పార్టీలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, జెసి దివాకర్ రెడ్డి, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కేఈ ప్రభాకర్ రెడ్డి, పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబాలు రెండు టికెట్లు కోసం ఆశిస్తున్నాయి.కానీ చంద్రబాబు నుంచి ఆ స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ ఎన్నికల్లో విపరీతమైన పోటీ, పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉండడం.. తదితర కారణాలతో కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వగలనని చంద్రబాబు తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ సీటు కావాలో.. ఎమ్మెల్యే సీటు కావాలో తేల్చుకోవాలని వారికే అడుగుతున్నట్లు సమాచారం.

చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం అసెంబ్లీకి, కొడుకు విజయ్ అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్నారు. పరిటాల సునీత రాప్తాడులో, కొడుకు శ్రీరామ్ ధర్మవరంలో టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తనకు కర్నూలు ఎంపీ సీటు, భార్య సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ కావాలని కోరుతున్నారు. కేఈ ప్రభాకర్ రెడ్డి సోదరులు డోన్ అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు పత్తికొండ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం ఎంపీగాను, కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అటు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంలో పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. అయితే పొత్తులో భాగంగా జనసేన, బిజెపికి 40 అసెంబ్లీ స్థానాలు, పది పార్లమెంట్ స్థానాలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే.. మిగతా నాయకులు అసంతృప్తి చెందే అవకాశం ఉంది. అందుకే అటువంటి అవకాశం ఇవ్వకుండా.. కుటుంబానికి ఒకటే టికెట్ అని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. దీంతో సీనియర్లకు ఇది మింగుడు పడని విషయంగా మారింది.