Chandrababu vs BJP : బీజేపీపై చంద్రబాబు ఆశలు వదిలేసుకున్నాడా..? ఏపీలో ఏం జరగబోతోంది?

Chandrababu vs BJP : అవసరార్థం రాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన ఘనుడు దేశంలో లేడన్న టాక్ తెలుగు నాట ఉంది. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని.. ఎంతటి శత్రువునైనా కౌగిలించుకుంటాడని.. సొంత పిల్లనిచ్చిన మామను కూడా గద్దెదించుతాడని ఆయన చరిత్రను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. 2019లో బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ పంచన చేరి రాహుల్ ను ప్రధాని చేయాలని చంద్రబాబు ఎక్కని ఫ్లైట్ లేదు.. తొక్కన గడపలేదు. అయితే […]

Written By: NARESH, Updated On : February 17, 2023 2:18 pm
Follow us on

Chandrababu vs BJP : అవసరార్థం రాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన ఘనుడు దేశంలో లేడన్న టాక్ తెలుగు నాట ఉంది. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని.. ఎంతటి శత్రువునైనా కౌగిలించుకుంటాడని.. సొంత పిల్లనిచ్చిన మామను కూడా గద్దెదించుతాడని ఆయన చరిత్రను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. 2019లో బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ పంచన చేరి రాహుల్ ను ప్రధాని చేయాలని చంద్రబాబు ఎక్కని ఫ్లైట్ లేదు.. తొక్కన గడపలేదు. అయితే చంద్రబాబు బ్యాడ్ లక్. దేశంలో కాంగ్రెస్ ఓడింది. ఆంధ్రాలో బాబు ఓడాడు. అందుకే తత్త్వం బోధపడి బీజేపీకి మద్దతుగా తన నలుగురు రాజ్యసభ ఎంపీలను పంపి సంధి చేసుకున్నాడు. ఇప్పుడు బీజేపీ కలిస్తే పొత్తు పెట్టుకొని సాగడానికి రెడీ ఉన్నాడు. కానీ ఏపీ బీజేపీ నేతలు.. కేంద్రం పెద్దలు ఒకసారి మోసం చేసిన చంద్రబాబుతో కలిసి సాగేందుకు రెడీగా లేరు. పవన్ కళ్యాణ్ ను దూరం చేసేలా బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఇవన్నీ అవగతం చేసుకున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సడెన్ గా గేర్ మార్చేశాడు. బీజేపీపై పూర్తిగా ఆశలు వదిలేసి అసలు రాజకీయం షురూ చేశాడన్న చర్చ సాగుతోంది..

-బీజేపీని దెబ్బతీయడమే ధ్యేయంగా పావులు..
బీజేపీ పొత్తులకు రెడీగా లేదు. పిలిచినా రావడం లేదు. సో ఇక యాంటీ బీజేపీ పాలిటిక్స్ ను చంద్రబాబు రెడీ చేస్తున్నారు. నాడు బీజేపీలోకి పంపిన నేతలందరినీ తిరిగి టీడీపీలో చేర్చుకునే పనిలో పడ్డారు. ఇక బీజేపీలో ఉక్కపోతతో అసంతృప్తితో రగులుతున్న నేతలకు గాలం వేస్తున్నారు. బీజేపీని దెబ్బతీయడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లిన నలుగురు ఎంపీలు.. తాజా మాజీ మంత్రులను తిరిగి రప్పించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అటువంటి వారంతా ఇప్పుడు టీడీపీకి టర్న్ అయ్యేలా చేస్తున్నారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో సాగుతోంది. వారంతా తమ అవసరాల కోసం వెళ్లారు తప్ప.. బీజేపీ విధానాలకు ఆకర్షితులయ్యో వెళ్లలేదన్నది జగమెరిగిన సత్యమే.

-నేడు కన్నా.. రేపు పురంధేశ్వరి.. టీడీపీలోకి నేతల క్యూ..
ఇప్పుడు బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. రేపోమాపో టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఆయన బాటలోనే నెక్ట్స్ వచ్చేది బీజేపీలో సీనియర్ నాయకురాలు.. నందమూరి ఆడబిడ్డ పురంధేశ్వరి అన్న టాక్ నడుస్తోంది. తన సడ్డకుడి భార్య అయిన పురంధేశ్వరితో ఇటీవల చంద్రబాబు మాటలు కలిపారు. ఆమెకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలోకి వస్తే పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. టీడీపీలో తన కుమారుడికి పర్చూరు టికెట్ , తనకు ఎంపీ టికెట్ ఖాయం చేసుకున్నాకే పురంధేశ్వరి టీడీపీలో చేరికకు ఒప్పుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి చంద్రబాబు ఓకే అనడంతో పాత పగలన్నీ పక్కనపెట్టి పురంధేశ్వరి కూడా టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇక ఆ తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు క్యూలో ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు అనుకూల వర్గం అంతా తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు రెడీ అయ్యారట..  సీఎం రమేష్ మాత్రం కొద్దిరోజులు అక్కడ పరిస్థితులన్నీ స్టడీ చేశాక బయటకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది.. అయితే ఈ నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రత్యేక టాస్క్ ఇచ్చి చంద్రబాబే బీజేపీలోకి సాగనపంపారు. బీజేపీ హైకమాండ్ కు ఈ విషయం తెలియంది కాదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహ్వానించారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల్లో చంద్రబాబుపై ఉన్న కోపాన్ని ఈ నలుగురు నాయకులు కొంతవరకూ తగ్గించగలిగారు. బీజేపీతో టీడీపీకి పొత్తుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలిగారు. కానీ పొత్తుకు బీజేపీ అంగీకరించకపోవడంతోనే ఇప్పుడు చంద్రబాబు రూటు మార్చి బీజేపీని టార్గెట్ చేసి దెబ్బతీసే పని పెట్టుకున్నారు. బీజేపీ నుంచి తర్వాత ఎవరెవరు టీడీపీలోకి వస్తారన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది.

-కమ్మ లాబీ ఒక్కటి.. బీజేపీని దెబ్బతీసేలా చంద్రబాబు ఎత్తుగడ..
బీజేపీ నేతలను చేర్చుకునే క్రమంలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందు కోసం కమ్మ లాబీని మరోసారి బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా దించినట్టు ప్రచారం సాగుతోంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చంద్రబాబు, కమ్మలాబీ ఇప్పుడు బయటపడడం వెనుక ఎన్నికల టైం రావడమే కారణం అంటున్నారు. బీజేపీని దెబ్బతీయడానికే చంద్రబాబు ఈ పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతల నైతికస్థైర్యం దెబ్బతీసేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణ తాను పార్టీ వీడడానికి సోము వీర్రాజే కారణమని ఆరోపించారు. అటు జీవీఎల్ పై కూడా విమర్శలు చేశారు. బీజేపీ హైకమాండ్ తనను అన్నివిధాలా ప్రోత్సహించిందని.. ప్రధాని మోదీ విజనరీకి ఇప్పటికీ తాను అభిమానినే అంటూ కన్నా వ్యాఖ్యలు వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందన్న అనుమానం ఉంది. ఒక వైపు పొత్తుకు ప్రయత్నిస్తునే కన్నాను లాగేయడంపై హైకమాండ్ పెద్దలు ఆగ్రహిస్తారని తెలుసు. అందుకే సోము వీర్రాజు, జీవీఎల్ పై విమర్శలు చేయించి ముందే చంద్రబాబు జాగ్రత్తపడ్డారని అంటున్నారు.. ఆ ఇద్దరు నేతల వైఖరి వల్లే రాష్ట్రంలో బీజేపీ దెబ్బతింటోందన్న సంకేతాలు పంపించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఆదినారాయణరెడ్డిలను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ రూపొందించారు.

ప్రస్తుతానికి చంద్రబాబు సోము వీర్రాజు, ఎంపీ జీవిఎల్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు జిల్లాలో బీజేపీ నాయకులను టీడీపీ గూటికి తెచ్చే ప్లాన్ లో ఉన్నారు.వారితో సోము వీర్రాజుపై విమర్శలు చేయించనున్నారు. ఆయన వైఖరితోనే తాము బీజేపీని వీడుతున్నట్టు చెప్పించనున్నారు. బీజేపీతో పొత్తుకు సోము వీర్రాజు, జీవీఎల్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే హైకమాండ్ లో వారిద్దర్నీ పలుచన చేయ్యాలని చూస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తోనే బీజేపీ నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారన్న మాట. ఇన్నాళ్లు బీజేపీ భయానికి సైలెంట్ గా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల వేళ ఆ పార్టీని దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది. చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తోంది.