
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో తెలిసిందే. లోటు బడ్జెట్ మొదలు.. రాజధాని ఏర్పాటు దాకా ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కేవలం హామీ కాదు. పార్లమెంట్ సాక్షిగా చట్టం కూడా చేసింది. కానీ.. అమలు సంగతి ఏంటీ అని అడిగితే.. నీళ్లు నమిలే పరిస్థితి. ప్రత్యేక హోదా వంటి అంశాలను అమలు చేసేది లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. దీంతో.. పార్లమెంటులో చేసిన చట్టానికి కూడా దిక్కులేకుండా పోయిన పరిస్థితి.
అయితే.. కొత్తగా ఏర్పడి కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి సహకారం చేయాల్సింది పోయి.. రాష్ట్రంలో ఉన్న సంస్థలను కూడా అమ్మేసే కార్యక్రమానికి తెరతీసింది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వాళ్లకు అమ్మేసేందుకు నిర్ణయం తీసుకోవడం.. అందుకు సంబంధించిన పనులన్నీ చకచకా జరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయే తప్ప.. కార్మికుల గురించి, ఫ్యాక్టరీ గురించి పట్టించుకోవట్లదనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. మీడియా ముందు మైకు పట్టుకొని సొల్లు చెప్పడం తప్ప.. ఉద్యమ కార్యాచరణ రూపొందించింది లేదని, కనీసం కేంద్రాన్ని నేరుగా ప్రశ్నించింది కూడా లేదని మండిపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేంద్రాన్ని వివరణ కోరింది న్యాయస్థానం. దీంతో.. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడల ఉపసంహరణ జరుగుతోందని, ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపింది.
దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని పేర్కొంది. పెట్టుబడల ఉపంసహరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులు కూడా గతంలో ఉన్నాయని కేంద్రం గుర్తు చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన లక్ష్మీనారాయణపై వ్యాఖ్యలు చేసింది. ఆయన విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారని, కేవలం రాజకీయ లబ్ధికోసమే ఆయన ఈ పిటిషన్ వేశారని పేర్కొంది. అందువల్ల ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించింది. మరి, న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెబుతుందన్నది చూడాలి.