
AP MLC Elections: ఏపీ సీఎం జగన్ ఇటీవల అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనలో ఈ మార్పునకు భయమో..లేకుంటే వ్యూహమో కారణాలు తెలియదు కానీ.. తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఆది నుంచి పార్టీలో విధేయత అన్న మాట వినిపిస్తూ వచ్చింది. అయితే ప్రారంభంలో విధేయతకు పెద్దపీట వేసినా.. ఇప్పుడు మాత్రం రాజకీయ లబ్ధికే ప్రాధాన్యమిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడానికి, గట్టెక్కించేవారికి పదవులు కట్టబెడుతున్నారు. విపక్షంలో ఉన్నవారికి ఏకంగా పదవులు కేటాయింపులు చేస్తున్నారు. మొన్న జయమంగళం వెంకరమణ, నేడు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడాన్ని సొంత పార్టీ శ్రేణులే తప్పుపడుతున్నాయి.
కైకలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జయమంగళం వెంకటరమణ కొద్దిరోజుల కిందట సీఎం జగన్ ను కలిశారు. టీడీపీలో ఉన్నా టిక్కెట్ రాదన్న అభద్రతా భావంతో ఉన్న వెంకటరమణను జిల్లా మంత్రి వెంటబెట్టుకొని సీఎం దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన ఇలా కలిశారో లేదో.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన్ను ఎంపిక చేసినట్టు అనుకూల మీడియాకు లీకులిచ్చారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆశ్యర్యం వ్యక్తమైంది. కైకలూరులో వైసీపీ ఎమ్మెల్యేగా దూలం నాగేశ్వరరావు ఉన్నారు. జయమంగళం రాకను ఆయన వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏకంగా పార్టీలోకి రప్పించి ఎమ్మెల్సీ స్థానాన్నికట్టబెడుతుండడంతో దూలం కీనుక వహిస్తున్నారు.
నిన్నలేదు మొన్న తిరుపతికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్రలో అన్నీతానై వ్యవహరించిన డాక్టర్ ఎందుకో చిన్నబోయారు. తనకు టీడీపీలో ప్రాధాన్యం దక్కడం లేదని చెబుతూ పార్టీకి రాజీనామా ప్రకటించారు. అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఆయన ఇలా చెప్పారో లేదో? ఆయన పేరు ఎమ్మెల్సీ ఎంపిక జాబితాలోకి తీసుకున్నారు. 2009లో ప్రజారాజ్యంతో ఎంట్రీ ఇచ్చిన సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి నుంచి పోటీచేసి ఓడిపోయారు. అటు టీడీపీలో చేరి రాష్ట్రస్థాయి పదవిలో ఉన్నారు. తిరుపతిలో పేరు మోసిన డాక్టర్. అయినా టీడీపీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ ఏకంగా ఆయన పేరును ఎమ్మెల్సీ జాబితాలో ఎక్కించడాన్ని సొంత పార్టీ నేతలకు మింగుడు పడడంలేదు.

అటు జయమంగళం వెంకటరమణ అయినా.. ఇటు సిపాయి సుబ్రహ్మణ్యం అయినా పార్టీలోకి తీసుకునేటప్పుడు స్థానిక నాయకులతో పనిలేదన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. అంతా ఐ ప్యాక్ సూచనలతోనే పాటిస్తున్నారు. జయమంగళంతో డెల్టా ప్రాంతంలో కమ్మ సామాజికవర్గానికి, సిపాయి సుబ్రహ్మణంతో చిత్తూరు జిల్లాలోని వన్నెకుల క్షత్రియ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవచ్చన్నది ఐ ప్యాక్ టీమ్ నివేదికగా తెలుస్తోంది. దీంతో జగన్ కూడా మొగ్గుచూపినట్టు సమాచారం. కనీసం జిల్లా నాయకత్వాన్ని సైతం సంప్రదించలేనట్టు తెలుస్తోంది. దీంతో అధికార వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీలో ఉంటేనే పదవులు దక్కుతాయని సెటైర్లు వేసుకుంటున్నారు.
