
తీవ్ర వాగ్వాదాలు, ఆవేదన, హెచ్చరికల తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఏపీ కోవిడ్ రోగులను అడ్డుకోకుండా సరిహద్దుల్లో అటూ ఇటూ పంపిస్తోంది. హైదరాబాద్ కు వచ్చే ఏపీ అంబులెన్స్ ల కష్టాలు ఇక తీరిపోయాయి. ఇన్నిరోజులు సరిహద్దుల్లోనే ప్రాణాలతో పోరాడుతున్న ఏపీ రోగులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు తెలంగాణ పోలీసులు అడ్డుకోకపోవడంతో ఇక సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లు చికిత్స కోసం హైదరాబాద్ కు వచ్చేస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసిన తెలంగాణ పోలీసులు ఈరోజు నుంచి అలా ఆపకుండా వదిలేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో కేసీఆర్ సర్కార్ ను నిలదీసింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవత్వం చూపాలని హితవు పలికింది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని హితవు పలికింది. దీంతో అంబులెన్స్ లకు అడ్డంకులు తొలిగిపోయాయి.
హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను అడ్డుకోవడం మానేసింది. నిన్న రాత్రి 10 గంటల నుంచి వాటిని అనుమతిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ నుంచి పాసులు ఉన్నా లేకున్నా కోవిడ్ బాధితులు వివరాలు నమోదు చేసుకొని అంబులెన్స్ లను పంపిస్తున్నారు. దీంతో హైదరాబాద్ వెళ్లనున్న రోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్లు పడ్డ అగచాట్లకు చెక్ పడింది.