Nara Lokesh Padayatra: రాజకీయాలు ఆ కుటుంబానికి కొత్త కాదు. కానీ అతనికి అనుభవం కొంతే. పాలనానుభవం ఉన్నప్పటికీ ప్రజల్లో తిరిగింది తక్కువే. ఇన్నాళ్లు నాన్న అడుగుజాడల్లో నడిచారు. ఇప్పుడు నాన్న బాధ్యతల్ని భుజానికెత్తున్నారు. ప్రతి గడపనూ పలకరించేందుకు ప్రయాణమయ్యారు. నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు బయలుదేరారు. హైదరాబాద్ ఇంటి నుంచి ఎన్టీఆర్ ఘాట్ చేరుకుని ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అనంతరం కడపకు బయల్దేరి వెళ్లారు. లోకేష్ పాదయాత్ర 400 రోజులు, 4000 కిలోమీటర్లు ఏపీ వ్యాప్తంగా సాగుతుంది. లోకేష్ పాదయాత్ర ఏపీలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ ముందుకుపోతుంది. ఈ సందర్భంగా లక్షలాది మందిని లోకేష్ ప్రత్యక్షంగా కలుస్తారు. లోకేష్ రాజకీయ జీవితంలో పాదయాత్ర మొదటి అడుగు అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లు తండ్రిచాటు బిడ్డలా ఉన్న లోకేష్.. మొదటిసారి పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకుని బయల్దేరారని చెప్పవచ్చు.
నారా లోకేష్ హైదరాబాద్ ఇంటి నుంచి పాదయాత్రకు వెళ్లే ముందు.. చంద్రబాబు ఇంట్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదట తండ్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తల్లి భువనేశ్వరిల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత మామ బాలకృష్ణ దంపతలు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నారా బ్రహ్మణి హారతినిచ్చింది. ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లే ముందు మామ బాలకృష్ణ స్వయం బయటికి వచ్చి వాహనం ఎక్కించారు. నారా లోకేష్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునే ముందు కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబు కూడ ఒకింత ఎమోషనల్ అయ్యారని చెప్పవచ్చు.

నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. లోకేష్ పాదయాత్ర విజయవంతం పైనే టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంకోరకంగా చెప్పాలంటే లోకేష్ రాజకీయ భవితవ్యం కూడ పాదయాత్ర మీదే ఆధారపడి ఉంది. టీడీపీకి, నారాలోకేష్ కు పాదయాత్ర ఓ విషమ పరీక్ష అని చెప్పవచ్చు. లోకేష్ పాదయాత్రలో ప్రజలతో ఏ మేరకు మమేకం అవుతారు ? ప‌్రజల మనసులు ఏ మేరకు గెలుచుకుంటారు ? అన్న అంశం ఇప్పుడు కీలకం కాబోతోంది.