
Pawan Kalyan- BJP : రాష్ట్రంలో వైసీపీని మరోసారి అధికారంలో రాకుండా చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. తన మిత్రపక్షమైన బిజెపిని రోడ్డు మ్యాప్ కావాలంటూ కొద్దిరోజుల కిందట అడిగారు. బిజెపి నుంచి దీనిపై స్పందన లేకపోవడంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు దిశగా తన అడుగులు వేయడం ప్రారంభించారు. కొద్దిరోజుల కిందట నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో బిజెపి – జనసేన మధ్య మళ్లీ ఏదో జరుగుతోంది అన్న చర్చ సాగింది. తాజాగా బిజెపి రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు అన్ని రోడ్డు మ్యాపులు అందించామని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠకు కారణమైంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరినట్టుగానే బిజెపి రోడ్డు మ్యాప్ అందించిందా అంటే అవునన్న సమాధానమే బిజెపి నాయకుల నుంచి వినిపిస్తోంది. బిజెపి రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భారతీయ జనతా పార్టీ తరఫున రోడ్డు మ్యాప్ లు ఇచ్చామని చెప్పడం రాష్ట్రంలో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు తావుతీసింది. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే పవన్ కళ్యాణ్ ని అడగాలని మీడియాకు ఆయన సూచించడం గమనార్హం. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రతిభా పోటీలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేస్తామని బిజెపి నేతలు చెబుతున్నా.. పవన్ మాత్రం ఎక్కడా బిజెపితో కలవడం లేదు. కనీసం బిజెపి నేతలతో కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించడం లేదు.
ఢిల్లీ వెళ్లి బిజెపి నాయకులతో సమావేశం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజులు కిందట ఢిల్లీ పర్యటనకు వెళ్లి బిజెపి నాయకులతో సమావేశం అయ్యారు. ఏపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ తో రెండు సార్లు సమావేశం అయ్యారు. అనంతరం జేపీ నడ్డాతో మరోసారి భేటీ అయ్యారు. కర్ణాటకలో ప్రచారం కోసం అనే ప్రచారం జరిగినా అది ఉత్తిదేనని తేలిపోయింది. ఆయనను స్టార్ క్యాంపైనర్లు జాబితాలో బిజెపి చేర్చలేదు. అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం బిజెపి కోసం లేనట్లేనని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఏపీ కోసమే చర్చించారని స్పష్టమవుతుంది. మరి ఏం చర్చించారో ఎవరు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో భేటీ తర్వాత కూడా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పులు రాలేదు. ఇప్పటికీ రాష్ట్ర బిజెపి నాయకులు, జనసేన నాయకులు ఎడ మొహం పేడ మొహంగానే కనిపిస్తున్నారు.
సస్పెన్స్ గా మారిన పవన్ కళ్యాణ్ నిర్ణయం..
బిజెపి రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే బీజేపీ రోడ్డు మ్యాప్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. అయితే బిజెపి ఇచ్చిన రోడ్డు మ్యాప్ పవన్ కళ్యాణ్ కు ఇష్టపడిందా లేదా అన్న విషయం స్పష్టం కాలేదు. బిజెపి ఇచ్చిన రోడ్డు మ్యాప్ కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారా..? లేక మరో దారివైపు వెళ్తారా అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలు వేడి పెరుగుతున్నా.. ఆయన ఇంకా జనాల్లోకి రావడం లేదు. అయితే బిజెపి ఇచ్చిన రోడ్డు మ్యాప్ పై పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ఆలోచనలు చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు బిజెపి రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ వ్యాఖ్యలతో వ్యక్తమవుతున్నాయి.
రోడ్ మ్యాప్ లో ఏముందో..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపిని రోడ్డు మ్యాప్ అడిగినప్పటికీ.. పవన్ కళ్యాణ్ ముందు నుంచి మాత్రం ఒకటి కోరుకుంటున్నారు. అదే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసిపి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోకూడదు అని. అయితే బిజెపి నేతలు ఇచ్చిన తాజా రోడ్ మ్యాప్ అందుకు అనుగుణంగా ఉందా లేదా అన్నది ఇప్పుడు అందరి మదిని తొలచి వేస్తున్న ప్రశ్న. ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చి రెండు వారాలు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆ సమావేశాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీనిని బట్టి బిజెపి నేతలు ఇచ్చిన రోడ్డు మ్యాప్ పవన్ కు సహించడం లేదని, అందుకే ఆయన దాని గురించి మాట్లాడడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బహిరంగంగా బిజెపి ఇచ్చిన రోడ్డు మ్యాప్ పై మాట్లాడితే గాని స్పష్టత రాదని పలువురు చెబుతున్నారు.