BJP- JAGAN : రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి బలం తగ్గింది. నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో బీజేపీ బలం 90 కిందకు పడిపోయింది. శనివారం నలుగురు సభ్యులు పదవీ విరమణ చేశారు. దీంతో బిజెపి బలం 86కు పడిపోగా.. ఎన్డీఏ బలం 101 గా ఉంది. దీంతో రాజ్యసభలో తటస్థ పార్టీలు కీలకం కానున్నాయి. ముఖ్యంగా వైసిపి 11 స్థానాలు కలిగి ఉండడంతో.. బిజెపి వైసిపి వైపు చూడక తప్పదు. మరి కొద్ది నెలల్లో రాజ్యసభలో ఖాళీలు భర్తీ అయిన వరకూ వైసీపీతో సఖ్యత కొనసాగించాల్సిన పరిస్థితి ఎదురైంది.
రాజ్యసభలో 245 స్థానాలు ఉంటాయి. తాజాగా నామినేట్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ సెకల్, సోనాల్ మాన్ సింగ్, మహేష్ జట్మలాని రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. వీరిని రాష్ట్రపతి నామినేట్ చేసినా.. సభ్యులుగా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తుంటారు. త్వరలో ఈ నాలుగు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది. అప్పుడు తప్పకుండా ఈ నాలుగు రాజ్యసభ సీట్లు బిజెపి ఖాతాలోనే పడతాయి. ప్రస్తుతం రాజ్యసభలో 226 మంది సభ్యులు ఉన్నారు. 19 ఖాళీలు ఉన్నాయి. బిజెపికి 86 మంది, కాంగ్రెస్కు 26 మంది, తృణమూల్ కాంగ్రెస్ కు 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అటు తరువాత వైసిపికి అత్యధికంగా 11 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు బిజెపి ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టినా వైసిపి అవసరం కీలకం.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పదిమంది రాజ్యసభ సభ్యులు పోటీ చేశారు. పదిమంది లోక్ సభకు ఎన్నికయ్యారు. దీంతో వారు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. మరోవైపు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కే.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. దీంతో మొత్తం 11 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 11 పోను మిగిలిన నాలుగు జమ్మూ కాశ్మీర్ కి చెందినవి. అక్కడ అసెంబ్లీ లేనందున ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేదు. మిగిలిన నాలుగు సీట్లను రాష్ట్రపతి నామినేటెడ్ సభ్యులతో భర్తీ చేయనున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపి అవసరం బిజెపికి కీలకంగా మారింది.
ఎన్డీఏ పరంగా రాజ్యసభ బలం 101 కాగా.. బిజెపి పరంగా 86 కు పడిపోవడం ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే మరికొద్ది వారాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. బిజెపితో పాటు ఎన్డీఏ బలం పెరగనుంది. బీహార్, మహారాష్ట్ర, అస్సాంలలో రెండేసి చొప్పున.. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒకటి చొప్పున బిజెపి ఖాతాలో పడనున్నాయి. దీంతో రాజ్యసభలో బిజెపి సంపూర్ణ విజయం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఎన్నిక సమయంలో బిజెపి వైసిపి మద్దతు తీసుకుంది. ఇప్పుడు కూడా రాజ్యసభ బిల్లుల విషయంలో జగన్ బిజెపి వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఇండియా కూటమి వైపు రావాలని ఆ పార్టీలు కోరుతున్నా
.. తనపై ఉన్న కేసుల దృష్ట్యా జగన్ బిజెపి కి జై కొడతారు. అటు సంపూర్ణ బలం వచ్చేవరకు రాజ్యసభలో వైసిపి అవసరాన్ని వినియోగించుకోవాలని బిజెపి చూస్తుంది. ఇలా ఎలా చూసుకున్నా వైసీపీ ఇప్పుడు బిజెపికి కీలకం.
ప్రస్తుతం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేదు.మరో మూడు సంవత్సరాల్లో టిడిపి ప్రాతినిధ్యం జరుగుతుంది. వైసీపీకి తగ్గుతుంది. అప్పటివరకు బిజెపి సైతం వైసీపీ విషయంలో చూసీ చూడనట్లుగా వెళుతుంది. బిజెపికి ఇప్పుడు లోక్ సభలో టిడిపి, రాజ్యసభలో వైసిపి అవసరం కీలకం. కానీ ఏపీలో మాత్రం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉండడం విశేషం.