Bandi Sanjay: అధికారం ఉన్నంతవరకు చుట్టూ చేరే వారితో బలగం బాగానే కనిపిస్తుంది. అదే అధికారాంతమున అసలు నిజం కళ్ళ ముందు కదలాడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఇది బిజెపి పూర్వాధ్యక్షుడు బండి సంజయ్ కి అనుభవంలోకి వచ్చింది కాబట్టి.. మొన్న ఢిల్లీ నుంచి రాగానే బండి సంజయ్ కి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 500 కార్లతో ర్యాలీ నిర్వహించారు. సీఎం సీఎం అంటూ నినాదాలు కూడా చేశారు. ఏ బిజెపి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడికి దక్కనంత గౌరవాన్ని అందించారు.. ఇది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మాత్రమే కాకుండా మిగతా వారికి కూడా ఇబ్బంది కలగజేసింది. ఎందుకంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ స్థాయిలో ఆయనకు గౌరవం దక్కలేదు. ఈటెల రాజేందర్ కు మంచి పదవి లభించినప్పటికీ ఈ స్థాయిలో అభినందన పొందలేదు. కానీ వీరందరి కంటే భిన్నంగా బండి సంజయ్ ప్రజల నుంచి సత్కారం పొందారు. ఇదే ఆయన పుట్టినరోజు నాడు మాత్రం సీనియర్ల నుంచి ఒక శుభాకాంక్షలకు కూడా నోచుకోలేకపోయారు.
కిషన్ రెడ్డి చెప్పారు
బండి సంజయ్ ఈరోజు తన జన్మదినం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి వెళ్లారు. కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడ పరమశివుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీడియా కంటికి చిక్కకుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పెద్దలతో భేటీ అయ్యారు. సరే ఇదంతా ఆయన వ్యక్తిగతం. ఇంతకుముందు ఆయన తెలంగాణ అధ్యక్షుడిగా పని చేశారు.. రెండు అసెంబ్లీ స్థానాలను పార్టీ గెలుచుకునేలా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపికి రెండవ స్థానం సంపాదించి పెట్టారు. రాష్ట్రంలో అధికార భారత రాష్ట్ర సమితితో ఢీ అంటే ఢీ పరిస్థితి కల్పించారు. అలాంటి వ్యక్తి పూర్వ అధ్యక్షుడయిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు పట్టించుకోవడం మానేశారు. అంతేకాదు ఆయన జన్మదినం సందర్భంగా కేవలం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ మినహా మిగతా వారెవరూ శుభాకాంక్షలు చెప్పలేదు. ఈటెల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి వారు కనీసం సోషల్ మీడియా లోనైనా ఒక గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేయలేదు.
అదే పని చేసిందా?
వాస్తవానికి బండి సంజయ్ ని అధ్యక్షుడి స్థానం నుంచి బయటికి సాగనంపడానికి అనేక కారణాలు దోహదం చేసినప్పటికీ.. సొంత పార్టీలోనే ఒక బలమైన వర్గం గట్టిగా కృషి చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మాధవనేని రఘునందన్ రావు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడు కావడాన్ని ధర్మపురి అరవింద్ సమర్థించారు. బండి సంజయ్ వ్యవహార శైలి బాగోలేదని ఈటల రాజేందర్ నేరుగానే ధ్వజమెత్తారు. అయితే ఈ ముగ్గురూ బలమైన కోటరిగా ఏర్పడి బండి సంజయ్ ని పక్కన పెట్టించారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ పాత్ర పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని మించిపోయింది. వ్యక్తిగత విమర్శలతో రెండవ స్థానాల్లో ఉండాల్సిన పార్టీ చేజేతులా మూడో స్థానానికి దిగజారిపోయింది. బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షల విషయం ఆధారం గానే భారతీయ జనతా పార్టీ మూడవ స్థానంలోకి వెళ్లిపోయిందని ఎలా సూత్రీకరిస్తారు అనే ప్రశ్న రావచ్చు. కానీ ముంజేతి కంకణానికి అద్దం అక్కర్లేదు. తెలంగాణ ప్రజలు జరుగుతున్న పరిణామాలను గుర్తించిన అమాయకులు కాదు.