
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆయన సొంతంగా పార్టీ పెడుతాడా..? లేక ఇతర పార్టీల్లోకి చేరుతారా..? అనేది తేలకపోవడంతో ఈటల అనుచరులతో పాటు ఇతర పార్టీ నాయకులు సైతం ఈటల ఏం చేబుతాడోనని ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన మాత్రం అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీజేపీ నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారోనన్న కన్ఫ్యూజన్ జనాల్లో ఉంది. అయితే తాజాగా ఆయనను బీజేపీలోకి లాగేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పుకున్న ఆ పార్టీ నాయకులు ఆ తరువాత ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్లో ఓడిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్లో కీలక మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటికి పూర్తిగా రాకపోయినా ఆయనను పార్టీలో చేర్చుకుంటే తమకు లాభిస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీంతో ఈటలతో బీజేపీ నాయకులు పదే పదే సంప్రదింపులు చేస్తున్నారు.
తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫాం హౌజ్లో ఈటలతో సమావేశం అయినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి కీలక నేత కూడా వీరితో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైతే తగిన పోస్టు కూడా ఇప్పించేందుకు కృషి చేస్తామని ఈటలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాజేందర్ మాత్రం ఏ నిర్ణయం చెప్పలేదని సమాచారం.
ఇక ఈటల కు సన్నిహితుడైన ఒకరు ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఓడిపోయే అవకాశాలున్నాయని చెప్పాడట. అందువల్ల ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంలో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీలోకి ఈటలను తీసుకొస్తే కలిసి కట్టుగా కేసీఆర్ పై పోరాటం చేయవచ్చనే భావనలో ఉన్నారట.