Pawan Kalyan- BJP: పవన్ తో కొత్త లెక్కలకు తెరతీసిన బిజెపి

ఎన్నికల నాటికి టిడిపి, జనసేన, బిజెపి ఒక్కటవుతాయని అంతా భావించారు. వైసీపీ సైతం ఇదే తరహా ప్రచారం చేసింది. కానీ చంద్రబాబు అరెస్టుతో పరిస్థితి మారిపోయింది.

Written By: Dharma, Updated On : September 13, 2023 11:24 am

Pawan Kalyan- BJP

Follow us on

Pawan Kalyan- BJP: ఏపీలో రాజకీయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎవరికి ఎవరు శత్రువులో.. ఎవరు మిత్రులో తెలియని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. ఈ ఎపిసోడ్ తో ప్రజల్లో సానుభూతి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది. కానీ ప్రజలు లైట్ తీసుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు అన్ని పార్టీలు చంద్రబాబు అరెస్టును ఖండించాయి. పవన్ బాహటంగానే మద్దతు పలికారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపి స్పందించాల్సి వచ్చింది. ఆ పార్టీ కీలక నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు చంద్రబాబు అరెస్టు తీరును తప్పుపట్టారు.

ఎన్నికల నాటికి టిడిపి, జనసేన, బిజెపి ఒక్కటవుతాయని అంతా భావించారు. వైసీపీ సైతం ఇదే తరహా ప్రచారం చేసింది. కానీ చంద్రబాబు అరెస్టుతో పరిస్థితి మారిపోయింది. పవన్ శరవేగంగా స్పందించగా.. బిజెపి స్పందిస్తూనే వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో బిజెపి కలుస్తుందా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. అటు జగన్ సైతం చంద్రబాబు అరెస్టులో కేంద్ర పెద్దల సహకారం ఉందని వచ్చేలా సంకేతాలు పంపారు.ఈ పరిణామ క్రమంలో టిడిపి, జనసేనల నుంచి బిజెపి దూరంగా జరిగినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ దూకుడుగా స్పందించారు. హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టిడిపి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. దానికి కూడా పవన్ మద్దతు ప్రకటించారు. జగన్ చర్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. అయితే ఇంతలో బిజెపి చర్యలను గమనించి పవన్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. బిజెపి ఆదేశాలతోనే పవన్ వెనుకడుగు వేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది.

ఏపీలో జనసేన, బిజెపి కూటమి ఎదగడానికి ఇదే మంచి సమయమని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. వారాహి యాత్రతో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగిందని.. దాదాపు 14 శాతానికి చేరుకుందని అంచనా వేస్తున్నారు. దీనికి బిజెపి బలం తోడైతే కూటమి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని కేంద్ర పెద్దలు పవన్ ను ఒప్పిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రకటించారు. ఇప్పుడు గాని బిజెపి ఆలోచనను అమలు చేస్తే.. వైసిపి గెలుపునకు దోహద పడినట్లు అవుతుందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పవన్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బెయిల్ పై విడుదలయ్యాక ఏపీ రాజకీయాలు శరవేగంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.