Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. మొన్నటి వరకు దూకుడుగా ముందుకు సాగిన బిజెపి.. ఎందుకో వెనుకబడిపోయింది. దీంతో పొత్తులపై ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. జనసేన తో పాటుతెలుగుదేశం పార్టీని కలుపుకెళ్లే యోచన లో ఉందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మొన్న ఆ మధ్యన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోకేష్ ను తీసుకెళ్లి అమిత్ షా తో సమావేశపరిచారు. అదంతా తెలంగాణ ఎన్నికల కోసమేనని ప్రచారం జరిగింది. అటు తరువాత బిజెపి, టిడిపి విషయంలో ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట జనసేన అధ్యక్షుడు పవన్ ను కిషన్ రెడ్డి కలిశారు. మద్దతు కోరారు. అయితే పవన్ పొత్తులపై మాత్రమే సానుకూలత చూపారని.. మద్దతుపై ఆసక్తి చూపలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
అయితే తాజాగా పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిశారు. చంద్రబాబు అరెస్టు తరువాత కేంద్ర పెద్దలను కలిసి ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అమిత్ షాను పవన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే వారి మధ్యచర్చకు వచ్చిన అంశాలు ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే పవన్ కేవలం తెలంగాణ రాజకీయాల కోసమే అమిత్ షా తో చర్చించారని తెలుస్తోంది. అటు ఏపీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి.. తమ వంతు సహకారం ఏపీ అభివృద్ధికి ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో బిజెపి, జనసేన కలిసి పోటీ చేయడంపై అమిత్ షా తో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక్కడెక్కడ టిడిపి ప్రస్తావన రాలేదని సమాచారం. తెలంగాణలో ఇప్పటికే జనసేన 32 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే బిజెపి మాత్రం అన్ని స్థానాలు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం ఖమ్మం, కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలను మాత్రమే కేటాయించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఈనెల 27న హైదరాబాద్ లో ఒక నిర్ణయానికి వద్దామని అమిత్ షా పవన్ తో చెప్పినట్లు సమాచారం. మొత్తానికైతే టిడిపి తో బిజెపి జత కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే టిడిపి లేని కూటమి విషయంలో పవన్ కొంచెం ఆలోచిస్తున్నట్లు సమాచారం.