Huzurabad: రాష్ట్రంలో రాజకీయాల్లో అలజడి మొదలైంది. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు స్థబ్దుగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు వేగంగా కదులుతున్నాయి. ఏడేళ్లుగా తమకు తిరుగే లేదన్నట్టుగా వ్యవహరించిన టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణలు ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ జోష్ మీద ఉంది. ఇప్పుడు చాలా క్రీయశీలకంగా అడుగులు వస్తోంది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కూడా చురుకుగా కదలడం ప్రారంభించింది. కానీ హుజూరాబద్ బై పోల్ తరువాత కొంచెం నెమ్మదించినట్టు కనిపిస్తోంది.

కాంగ్రెస్‌లో లొల్లి..
హుజూరాబాద్(Huzurabad) ఫలితం తరువాత కాంగ్రెస్‌లో అంతర్గత అలజడి ఎక్కువైంది. నిజానికి టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించడం ఆ పార్టీ లోని సీనియర్ నాయకులకు మొదటి నుంచే ఇష్టం లేదు. అయినా హైకమాండ్ నిర్ణయానికి గౌరవమిచ్చారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. అన్ని జిల్లాలు తిరుగుతూ సభలు,సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టే దిశలో ఆయన అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి. ఆయన దృష్టి మొత్తం పార్టీ నిర్మాణంపై ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికలు కావడంతో రేవంత్ రెడ్డి దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ గెలుస్తామన్న నమ్మకం కూడా రేవంత్ రెడ్డికి లేదు. అందుకే హుజూరాబాద్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేయలేదు. పోటీలో ఉన్నామని తెలిపేందుకు నాలుగైదు సమావేశాలు నిర్వహించి ప్రచారం చేశారు. కానీ ఇదే ఆయనను హైకమాండ్ ముందు దోషిగా నిలబెట్టింది. ఎప్పటి నుంచో రేవంత్ పై గుర్రుగా ఉన్న సీనియర్ నాయకులు ఈ అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో హుజూరాబాద్ బైపోల్ ఓటమిపై చర్చ జరిగింది. రేవంత్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమావేశంలో సీనియర్లు రేవంత్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఢిల్లీ నాయకులు కల్పించుకొని అందరికీ సర్దిచెప్పారు. ఇక నుంచైనా కలిసి పని చేయాలని సూచించారు. ఇలా కాంగ్రెస్ అంతర్గత పోరుతో సతమవుతోంది. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలన్న ఆశ.. ఆశగానే మిగిలిపోతుంది.

బీజేపీ పటిష్ట అడుగులు..
తెలంగాణ అధికారం చేపట్టాలని ఎదురుచూస్తున్న బీజేపీకి హుజూరాబాద్ ఫలితం బూస్ట్ ఇచ్చింది. ఆ పార్టీ ఖాతాలో మరో ఎమ్మెల్యే సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బలపడి 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా హుజూరాబాద్ ఫలితాలు వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పార్టీని కింది స్థాయి నుంచి నిర్మాణం చేసేందుకు ఎవరేం చేయాలో అనే అంశాల్ని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రారంభించారు.
నిజానికి బీజేపీకి తెలంగాణ క్షేత్ర స్థాయిలో బలం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సంస్థాగతంగా బలంగా ఉంది. కాంగ్రెస్ నాయకులు కలిసి పని చేస్తే వచ్చే ఎన్నికల నాటికి మంచి మార్పు కనిపిస్తుంది. కానీ వారు ఒకరిపై ఒకరికి ఆరోపణలు చేసుకుంటూనే కాలం గడిపేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం క్రమశిక్షణగా తన పని తాను చేసుకుపోతోంది.
Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎవరు.. కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నాడు