Chandrababu Naidu: ఏపీ విషయంలో బిజెపి మైండ్ గేమ్ ఆడుతోంది. పొత్తుల వ్యవహారంపై ఒక స్పష్టతనివ్వడం లేదు. తెలుగుదేశం అవసరం కాబట్టి.. పొత్తులో సింహభాగం ప్రయోజనాలను బిజెపి(BJP) డిమాండ్ చేస్తోంది. గతంలో మాదిరిగా తక్కువ సీట్లతో సర్దుబాటు చేసుకుంటే కుదిరే పని కాదని తేల్చి చెబుతోంది. అందుకే జాతీయస్థాయిలో మిగతా రాష్ట్రాల్లో పొత్తులపై తేల్చేసినా.. ఏపీ విషయంలో మాత్రం జాప్యం జరగడానికి కారణం అదే.మరోవైపు అన్ని రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించినా…ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం బిజెపి పెండింగ్ లో పెట్టింది. పొత్తులపై ఒక రకమైన సంకేతాలు పంపించింది.
నెలరోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిశారు. కీలక చర్చలు జరిపారు. అయితే ఆ చర్చల సారాంశాన్ని మాత్రం అటు బిజెపి అగ్ర నేతలు బయట పెట్టలేదు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన చంద్రబాబు బయట పెట్టలేదు. కానీ బిజెపి డిమాండ్ సీట్లకు చంద్రబాబు తలొగ్గలేదని మాత్రం తెలుస్తోంది. వాస్తవానికి బిజెపి పొత్తుకు సులువుగా ముందుకు వస్తుందని చంద్రబాబు భావించారు. ఆ విధంగా సెట్ చేశారు కూడా. ఒకవైపు పవన్ ద్వారా ప్రయత్నిస్తూనే.. మరోవైపు బిజెపిలోని ప్రో టిడిపి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. తద్వారా సకాలంలో పొత్తులు కొలిక్కి వస్తాయని భావించారు. అయితే బిజెపి అగ్ర నేతలు మాత్రం అంత ఈజీగా సీట్లు విషయంలో రాజీ పడే పరిస్థితి కనిపించడం లేదు. పొత్తు కుదరాలంటే అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతుండడంతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబు బిజెపి పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఎల్లో మీడియాలో బిజెపికి వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారు. ఏకంగా జనసేనతో కలిపి 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. పొత్తుకు మీరు ముందుకు రాకుంటే మిగతా అభ్యర్థులను సైతం ప్రకటిస్తామని సంకేతాలు పంపిస్తున్నారు. రాబోయేది టిడిపి, జనసేన ప్రభుత్వమేనని ప్రకటనలు చేస్తున్న టిడిపి నేతలు ఎక్కడా బిజెపి ప్రస్తావన తీసుకురావడం లేదు. ఇదంతా బీజేపీపై ఒత్తిడి పెంచే మార్గమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు బీజేపీ నేతలు, ఇటు చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య తప్పకుండా కుదురుతుంది. ఆ విషయం వారికి కూడా తెలుసు. కానీ ఎక్కువ సీట్లు సాధించుకోవాలని బిజెపి.. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు వదులుకోకూడదని టిడిపి ఎవరి వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. అయితే ఈ వ్యూహాల అమలులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.