YCP Kapu Ministers – MLAs Meeting: వైసీపీలో ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేల్లో పునరాలోచన మొదలైందా? జగన్ తమను రాజకీయ సమిధులుగా మార్చారని అనుమానం పడుతున్నారా? వైసీపీలో కొనసాగితే తమ రాజకీయ జీవితం ముగిసినట్టేనని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు రహస్యంగా భేటీ అయ్యారన్న వార్త పొలిటికల్ క్లోజుడ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైసీపీ ఆవిర్భావం, కాపులకు ఇచ్చిన హామీలు, వాటిని పరిష్కరించకుండా దాటవేతలు, కాపు నాయకుల అణచివేత, మరీ ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ పై ముప్పేట దాడులు వంటి వాటిపై చర్చించినట్టు తెలుస్తోంది. వైసీపీలో ఉండి.. ఆ పార్టీ తరుపున పోటీచేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని నేతలంతా దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా.. అందరం కలిసే తీసుకుందామని డిసైడ్ అయినట్టు సమాచారం.

అయితే ఈ భేటీలో ఎక్కువ మంది జనసేనలో చేరేందుకు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఏపీలో జనసేన గ్రాఫ్ పెరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా అదే స్థాయిలో పైపైకి చేరుతోంది. ఈ సమయంలో కానీ పార్టీలో కొనసాగితే ఓటమి ఖాయమని చాలామంది వైసీపీ నాయకులు భయపడుతున్నారు. అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. పైగా వైసీపీ అధినేత జగన్ సైతం తమను అనుమానాపు చూపులు చూస్తున్నారన్న ఆవేదన వారిలో ఉంది. దాదాపు 50 మంది సిట్టింగ్ లకు టిక్కెట్లు తప్పిస్తానన్న జాబితాలో కాపు నేతలే అధికం. సంఖ్యాపరంగా కాపుల మంత్రి పదవులు చూపి.. తమను అన్నివిధాలా అణచివేస్తున్నారన్న బాధ కాపు ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. రెడ్డి సామాజికవర్గంతో పాటు ఇతర బీసీ వర్గాల ఎమ్మెల్యేలకు ఇస్తున్న విలువ కూడా కాపు ఎమ్మెల్యేలకు దక్కడం లేదన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాపు ప్రజాప్రతినిధుల సమావేశం చర్చనీయాంశంగా మారుతోంది.

ముఖ్యంగా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు జనసేన ఫీవర్ పట్టుకుంది. ఇటీవల పవన్ డోసు పెంచారు. వైసీపీ నేతల అవినీతిని సాక్షాధారాలతో సహా ప్రస్తావిస్తూ నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో సర్వ్యూలేట్ అవుతున్నాయి. ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబికుతోంది. అయితే ఈ అవినీతి కారకులు కూడా ప్రభుత్వ పెద్దలు, ఇతర సామాజికవర్గానికి చెందిన నాయకులే. వారి దందాతో తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆందోళన కాపు ఎమ్మెల్యేల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తాము చేసిన తప్పుకు బాధ్యత వహిస్తాం కానీ.. ఎవరో చేసిన తప్పులకు తాము బాధ్యులమవుతున్నామన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. అందుకే వారు సొంత పార్టీపై ఏహ్య భావం పెంచుకుంటున్నారు. జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి తరువాత జనసేనలో చేరికల సంఖ్య పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.