Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణకు షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపిలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు బొత్స నీడలో ఉన్న నాయకులు సైతం టిడిపిలో చేరుతుండడం విశేషం. రాజకీయంగా పేరు మోసిన కుటుంబాల సైతం తెలుగుదేశం పార్టీ గూటికి వస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, మరో మాజీ ఎమ్మెల్యే కుమారుడు, జిల్లా వయోజన విద్య అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కోట్ల సుగుణాకర్ రావు టిడిపిలో చేరారు. దీంతో బొత్స సత్యనారాయణకు పెద్ద ఝలక్ తగిలింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీలో చేరికలు పెరిగాయి.
మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు చేరికతో టిడిపికి అదనపు బలం చేకూరింది. సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా బాబూరావు కు మంచి పేరు ఉంది. 1994, 1999 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట బాబూరావు నడిచారు. కొద్ది రోజులకే ఆ పార్టీకి దూరమయ్యారు. అనంతరం బిజెపి గూటికి చేరారు. అక్కడ కూడా ఇమడ లేకపోయారు. తిరిగి ఇప్పుడు మాతృ పార్టీలోకి చేరిపోయారు. విజయనగరం జిల్లా వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడిగా పనిచేసిన కోట్ల సుగుణాకర్ రావు ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన తండ్రి సన్యాసప్పల నాయుడు చీపురుపల్లి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. గత కొన్నేళ్లుగా కోట్ల కుటుంబం బొత్స సత్యనారాయణ తో సన్నిహితంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన సుగుణాకర్ రావు టిడిపిలో చేరడం ఆ పార్టీకి అదనపు బలం. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుగుణాకర్ రావుకు విస్తృత బంధుగణం ఉంది. వారంతా టిడిపికి మద్దతు తెలపడం ఖాయం.
చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2004, 2009, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయినా.. గౌరవప్రదమైన ఓట్లు బొత్స సత్యనారాయణ ఆ ఎన్నికల్లో దక్కించుకున్నారు. కానీ ఈసారి పరిస్థితి మాత్రం తారుమారు అవుతోంది. వైసీపీ నుంచి టిడిపిలోకి భారీగా చేరికలు పెరుగుతున్నాయి. అటు నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత కూడా పతాక స్థాయికి చేరింది. తాజా పరిణామాలతో వైసిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇబ్బందులు తప్పవన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే బొత్స కుటుంబ రాజకీయాలతో జిల్లా ప్రజలు విసుగు చెందారు. ప్రజలు బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. అటు వైసీపీ శ్రేణులు టిడిపి వైపు అడుగులు వేస్తుండడం బొత్స సత్యనారాయణ కు ఇబ్బందికర పరిణామమే. బొత్స కోటకు బీటలు వారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.