KCR BRS: రాష్ట్రం మొత్తం వేరు. ఖమ్మంలో పరిస్థితి వేరు.. ఆ జిల్లా ఎప్పుడూ “కారు”కు దారి ఇవ్వలేదు..ఇవ్వదు కూడా… ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దుగా ఉండడం, రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లా ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి జై కొట్టింది.. 2018లో రాష్ట్రం మొత్తం “కారు” హవా సాగితే.. ఖమ్మంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాగింది. కేవలం ఖమ్మంలో పువ్వాడ అజయ్ మాత్రమే భారత రాష్ట్ర సమితి నుంచి గెలుపొందారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు గులాబీ కండువా కప్పు కోవడంతో భారత రాష్ట్ర సమితి గెలిచింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.

సిట్టింగ్ లకు ఇస్తామని చెప్పడంతో..
సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామని చెప్పడంతో అధికార భారత రాష్ట్ర సమితిలో లుకలుకలు ఏర్పడుతున్నాయి. మిగతా జిల్లాల్లో నివురు కప్పిన నిప్పులా ఉన్నా… ఖమ్మంలో మాత్రం బహాటంగానే వ్యక్తమవుతున్నాయి. మొన్న జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారత రాష్ట్ర సమితి అధినాయకత్వంపై నేరుగానే విమర్శలు చేశారు. గత కొంతకాలంగా భారత రాష్ట్ర సమితిలో మనకు దక్కుతున్న గౌరవం ఎలా ఉందో చూస్తున్నాం కదా అని.. పొంగులేటి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది జరిగిన మూడు రోజులకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం భద్రతను తగ్గించింది.. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని చెప్పడంతో చాలామంది నాయకులు అభద్రతాభావం లో ఉన్నారు.. ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు జిల్లాలో రాజకీయ పరిస్థితిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది.. ఆయన గత ఎన్నికల్లో పాలేరు స్థానంలో ఓడిపోయారు.. ఇప్పుడు కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు.. కానీ గతంలో ఆయన మీద గెలిచిన కందాల ఉపేందర్రెడ్డి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆయనను కాదని తుమ్మలకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు.
బిజెపి బలపడడం ఖాయం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయమని సంకేతాలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ అదే జరిగితే ఖమ్మంలో బిజెపి బలపడడం ఖాయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సిపి లో ఉన్నారు. అప్పుడు తాను పార్లమెంటు సభ్యుడిగా గెలిచి… అశ్వరావుపేట, వైరా, పినపాక నియోజకవర్గాల్లో తన అనుచరులను ఎమ్మెల్యేలు గెలిపించుకొని రికార్డు సృష్టించారు. 2019లో కెసిఆర్ పొంగులేటికి కాకుండా నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు.. అదే సమయంలో పొంగులేటికి మెరుగైన అవకాశాలు ఇస్తానని హామీ ఇచ్చారు.. కానీ ఇంతవరకు వాటిని అమలు చేయలేదు. దీంతో అప్పటి నుంచే పొంగులేటి నారాజ్ గా ఉన్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడంలో అధిష్టానం పూర్తిగా విఫలమైంది. మధ్యలో కేటీఆర్ రాయబారం నడిపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. ఒకవేళ వీరిద్దరు నేతలు కనుక భారతీయ జనతా పార్టీలో చేరితే భారత రాష్ట్ర సమితి ఇబ్బంది పడటం ఖాయం.

వారి వల్ల అవుతుందా
ప్రస్తుతం ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తాతా మధు కొనసాగుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరితే వారి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమవుతుంది.. పైగా పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి అయిన దగ్గర నుంచి ఒంటెత్తు పోకడలు పోతున్నారు. ఆయన వ్యవహారం కూడా పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చుతోంది. ఇక ఈయనకు, తుమ్మల, పొంగులేటి వర్గాలకు మొదటి నుంచి గ్యాప్ ఉంది. అయితే ఇప్పటి పరిణామాలు పువ్వాడకు సంతోషం కలిగించవచ్చు…కానీ దీర్ఘకాలంలో పువ్వాడ ఒక్కరే పార్టీని నడిపే పరిస్థితులు ఉండవు.