Pawan Kalyan: పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు వైసిపి సర్వశక్తులు ఒడ్డుతోంది. పవన్ పోటీ చేస్తారని ముందస్తు సమాచారంతోనే వంగా గీతను జగన్ ఎంపిక చేశారు. ముద్రగడ పద్మనాభంను కూడా పార్టీలోకి అందుకే తెచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలుగా, గత ఎన్నికల నుంచి కాకినాడ ఎంపీగా పనిచేసిన వంగా గీత పిఠాపురం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆమెకు విస్తృతమైన బంధుగణం కూడా ఆ నియోజకవర్గంలో ఉంది.మరోవైపు పోల్ మేనేజ్మెంట్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటన్నింటితో పవన్ ను దెబ్బతీయాలని భావించారు. అదే సమయంలో టిడిపి ఇన్చార్జ్ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించడంతో వైసీపీలో మరింత ఆశలు పెరిగాయి. పవన్ తప్పకుండా ఓడిపోతారన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
పిఠాపురంలో వర్మ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారు. 2014 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించారు వర్మ. కానీ హై కమాండ్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. తన సత్తా చాటారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన వర్మ అనుచరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వర్మను సస్పెండ్ చేస్తున్నట్లు ఒక లెటర్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అయితే అది ఫేక్ లెటర్ గా తేలింది. ఇంతలో చంద్రబాబు నుంచి వర్మకు పిలుపు వచ్చింది. తక్షణం కలవాలని చంద్రబాబు సూచించడంతో వర్మ నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి అధినేతను కలిశారు. చంద్రబాబు ఆయనను బుజ్జగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సరైన పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన మెత్తబడ్డారు. పవన్ గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు.
వాస్తవానికి పవన్ వంటి నాయకుడు పోటీ చేస్తే.. వర్మ లాంటి నాయకుడు ఆహ్వానించాలి. కానీ ఆయన కొద్దిగా అతి చేశారన్న ప్రచారం ఉంది. అయితే వైసీపీ నుంచి పిలుపును కూడా ఆశించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ హై కమాండ్ వర్మ ఎపిసోడ్ ను పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ వంగా గీతనే కంటిన్యూ చేశారు. మరోవైపు ఫేక్ సస్పెండ్ లెటర్ బయటికి రావడంతో వర్మ ఆగ్రహానికి గురయ్యారు. అది పార్టీ నిర్ణయంగా భావించారు. అందుకే ఎక్కువగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే అధినేత చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో శాంతించారు. చంద్రబాబు ఒప్పించడంతో వెనక్కి తగ్గారు. పవన్ విజయానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓటమి ఓట్లు చీలిపోయి.. ఈజీగా గెలుపు సాధిస్తాం అన్న వైసిపి ఆశలు నీరుగారిపోయాయి. వర్మ మనస్ఫూర్తిగా పనిచేస్తే పవన్ ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే వర్మ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ మాదిరిగా మిగిలింది. వైసీపీ ఆశలను నీరుగార్చింది.