Srungavarapukota YCP: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వైసీపీలో విభేదాలు బయటపడుతున్నాయి. ఇక్కడ నేతలు వైరి వర్గాలుగా విడిపోయి వీధి పోరాటానికి దిగుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా కడుబండి శ్రీనివాసరావు ఉన్నారు.ఎమ్మెల్సీగా ఇదే నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజు వ్యవహరిస్తున్నారు.అయితే ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్న రీతిలో పరిస్థితి ఏర్పడింది. ఇరువురు నేతలకు అగ్ర నాయకుల అండదండలు ఉన్నాయి. దీంతో ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. కేడర్ రెండు వర్గాలుగా విడిపోయింది.
2019 ఎన్నికల్లో కడుబండి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు .2014 ఎన్నికల్లో గజపతినగరం నుంచి శ్రీనివాసరావు బరిలో దిగారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా బొత్స కుటుంబం తెరపైకి వచ్చింది. దీంతో బొత్స సోదరుడు అప్పల నరసయ్య కు గజపతినగరం వైసీపీ టికెట్ ఇవ్వడం అనివార్యంగా మారింది. దీంతో గజపతినగరం నుంచి ఎస్. కోటకు కడుబండిని మార్చాల్సి వచ్చింది. దీంతో కడుబండి శ్రీనివాసరావు విజయానికి అక్కడి వైసీపీ శ్రేణులు సమన్వయంతో పని చేశాయి. అప్పట్లో బొత్స అనుచరుడుగా ఉన్న రఘురాజు సర్వశక్తులు ఒడ్డారు. దీంతో కడుబండి శ్రీనివాసరావు విజయం సునాయాసం అయ్యింది. ఎన్నికల అనంతరం కడుబండి, రఘురాజుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎప్పుడైతే హై కమాండ్ రఘురాజును ఎమ్మెల్సీ చేసిందో.. అప్పటినుంచి ఆ ఇద్దరి నేతల మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా బరిలో దిగాలని కడుబండి శ్రీనివాసరావు భావిస్తున్నారు. అయితే ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని ఇందుకూరి రఘురాజు కోరుతున్నారు. దీంతో ఇరువురి నేతల మధ్య టిక్కెట్ పోరు ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో క్యాడర్ నిట్టనిలువునా చీలిపోయింది. నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కొందరు కడుబండి వెంట వెళ్ళగా… మరికొందరు రఘురాజు వెంట నడుస్తున్నారు. ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలదీతల వెనుక రఘురాజు హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రఘురాజుకు మంత్రి బొత్స హస్తం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అదే సమయంలో కడుబండికి కి రాష్ట్ర అగ్రనేతల అభయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇద్దరూ కీలక నేతలు, ఆపై ప్రజాప్రతినిధులు కావడంతో అధికారులు నలిగిపోతున్నారు. ఎవరి ఆదేశాల పాటించాలో వారికి తెలియడం లేదు. అటు కేడర్ సైతం నలిగిపోతోంది.