Telangana Elections 2023: దాయాది రాష్ట్రంలో గెలుపు ఎవరిది? టిఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? కాంగ్రెస్ సత్తా చాటుతుందా? భారతీయ జనతా పార్టీ పట్టు సాధిస్తుందా? ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఇదే హాట్ టాపిక్. టీ దుకాణాల వద్ద ఇదే చర్చ. ఒకవైపు వన్డే క్రికెట్ టోర్నమెంట్, మరోవైపు తెలంగాణలో ఎన్నికలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. వందల కోట్ల రూపాయల మేర పందేలు కాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు సైతం.. పొలిటికల్ బెట్టింగులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో ప్రముఖులు బరిలో దిగిన నియోజకవర్గాలపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో కీలక నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాల్లో సెటిలర్స్ అధికం. ఏపీ మూలాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడ గెలుపోటములపై భారీ స్థాయిలో ఏపీలో బ్యాటింగ్ జరుగుతోంది. 1:5 ( ₹100కు 500 ) చొప్పున పందేలు కాస్తున్నారు. ఇక అగ్రనేతలు బరిలో ఉన్న నియోజకవర్గాల విషయంలో 1:10 ( ₹100కు 1000 ) అంటూ దళారులు ఊరిస్తున్నారు.
అయితే ప్రధానంగా బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీపైన ఎక్కువగా బెట్టింగ్ సాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన బెట్టింగ్ ముఠాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఎక్కడా నేరుగా రంగంలోకి దిగకుండా యాప్ లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో తెలంగాణ ఎన్నికలపై పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 3న ఫలితాల రోజు భారీగా నగదు చేతులు మారనుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అనుమానితులపై నిఘా పెంచుతున్నారు.