Bhubaneswari : నారా భువనేశ్వరి.. మొన్నటి వరకు ఆమె సాధారణ గృహిణి. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, మరో మాజీ సీఎం భార్య. రాజకీయ నేపథ్యం ఉన్నా.. క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం మాత్రం ఇదే తొలిసారి. తన భర్తను అక్రమంగా అరెస్టు చేయడంతో.. నిజం గెలవాలి పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఆమె యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు.ఆమె మాటలు కాస్త కోటలు దాటుతున్నాయి అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీడియాలో ఆమెకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతుండడంతో టిడిపి నేతలు ఆమెతో లేనిపోని అంశాలను మాట్లాడిస్తున్నారు. అసలు లక్ష్యాన్ని మరిచిపోతున్నారు.
ఈ రాష్ట్రానికి చంద్రబాబు సుదీర్ఘకాలంగా పాలించారు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. ఈ వయసులో ఆయనను అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారని భువనేశ్వరి చెప్పడం ద్వారా సానుభూతి దక్కించుకోవాలని టిడిపి ప్రయత్నిస్తోంది. అయితే ఈ క్రమంలో ఆమె రాజకీయాల జోలికి పోకపోవడమే మంచిదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ టిడిపి నేతలు మాత్రం ఆమెతో రాజకీయ విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ నిర్ణయం వికటిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి ఉందని.. అవినీతి చేసే అవసరం తమ కుటుంబానికి లేదన్నట్టు ప్రచారం చేయిస్తే వర్కౌట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భువనేశ్వరి యాత్ర చేపడుతున్నారు. నిజం గెలవాలి పేరిట సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరితో ఆమెకు ప్రశ్నలు వేయించడం, వాటికి భువనేశ్వరి సమాధానాలు ఎపిసోడ్ చూస్తే పక్కా డ్రామాగా తేలిపోతుంది. ఎక్కడ నేచురాలిటీ కనిపించడం లేదు. భువనేశ్వరిని ప్రశ్నలు అడిగిన వారిలో ఆ పార్టీ నేతలు ఎక్కువమంది ఉన్నారు. ప్రస్తుతం టిడిపి, జనసేన పొత్తులో ఉన్నాయి. ఆ రెండు పార్టీల మహిళా నాయకులను తీసుకొచ్చి భువనేశ్వరితో ముఖాముఖి మాట్లాడించడం ద్వారా.. ఏం సానుభూతి లభిస్తుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నిజం గెలవాలి పేరిట భువనేశ్వరి చేపడుతున్న యాత్రలకు ఎల్లో మీడియా ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది. కానీ దానిని మరింత సానుభూతి దిశ గా తీసుకెళ్లే బాధ్యత మాత్రం టిడిపి నేతల పైనే ఉంది. అది మరిచిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు లేనిపోని కార్యక్రమాలతో సమయాన్ని వృధా చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ద్వారా సానుభూతి పొందడం ఎలా అన్న అంశంపై దృష్టి సారిస్తే మంచిదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.