ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించడం సాధారణ విషయమే. తమ అభ్యర్థులు జారీపోకుండా ఉండేందుకు.. ప్రత్యేక ప్రాంతంలో దాచిపెడుతుంటారు. అయితే.. ఫలితాలు రాకముందే క్యాంపు రాజకీయానికి తెరతీసింది హస్తం పార్టీ.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిపోగా.. ఇంకా బెంగాల్లో ఎలక్షన్ కొనసాగుతోంది. ఇందులో అసోంలో అధికార బీజేపీ-కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోరు కొనసాగిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. ప్రీ-పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కూడా టగ్ ఆఫ్ వార్ అని తేల్చి చెప్పాయి. దీంతో.. ఎవరు గెలిచినా.. స్వల్ప తేడాతోనే అని భావిస్తున్నారు.
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, అసోం గణపరిషత్ కలిసి బరిలోకి దిగాయి. అటు.. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బోడో పీపుల్స్ ఫ్రంట్, ఆలిండియా డెమొక్రటిక్ ఫ్రంట్ వంటి పార్టీలతో కలిసి మహాకూటమిగా పోటీ చేసింది. కాంగ్రెస్ 60కిపైగా స్థానాలు గెలుస్తుందని, కొద్దిపాటి తేడాతో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ చెప్పాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. కాంగ్రెస్ ముందుగానే అభ్యర్థులను క్యాంపునకు తరలించింది. వాస్తవానికి మే 2న ఫలితాలు రానున్నాయి. అయితే.. హర్యానా, గోవా వంటి చోట్ల ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ సారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది కాంగ్రెస్. తమ అభ్యర్థులను బీజేపీ లాక్కుంటుందేమో అనే అనుమానంతో ముందుగానే జాగ్రత్త పడింది. మరి, ఫలితాలు ఎలా రానున్నాయి? అధికారం ఎవరు చేపట్టబోతున్నారు? అన్నది చూడాలి.