Bars Wine shops Shut : నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎన్నిక జరిగే రోజు నియోజకవర్గంలో సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ఎన్నికలో భాగంగా ఉపయోగించుకోవడంతో ఆ రోజు అక్కడ సెలవు ఇచ్చింది.

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని
హైదరాబాద్‌లో గల బార్‌లు, వైన్‌షాపులు నవంబర్ 1 నుంచి నవంబర్ 3 వరకు మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే స్టార్ హోటళ్లలో బార్లు , రిజిస్టర్డ్ క్లబ్బులు పనిచేయడానికి అనుమతించబడతాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 2705 లీటర్ల మద్యం సీజ్ చేశారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని 48 మందిని అరెస్టు చేశారు. పట్టుకున్న మద్యం విలువ రూ.5.59 లక్షలు గా తేల్చారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని తెలుస్తోంది.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో నియోజకవర్గంలో నవంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నవంబర్ 1న సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 3 సాయంత్రం 6 వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పాట్లు పడుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో మూడు రోజుల పాటు మద్యం షాపులను మూసివేసి మద్యం సరఫరాకు చెక్ పెట్టేందుకే వైన్స్ లను మూసి వేయనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగా పార్టీలు భావిస్తున్న తరుణంలో విజయం కోసం పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపు తీరాలు చేరుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందో తెలియడం లేదు. పార్టీలు మాత్రం ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నాయి. విజయం తమదే అనే ధీమా అన్ని పార్టీల్లో కనిపిస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలో ఓటర్లు తమ ఓటును ప్రశాంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివాదాస్పదమైన ప్రాంతాలను గుర్తించి భద్రతను ముమ్మరం చేస్తున్నారు. పోలీసుల నీడలో ఓటింగ్ నిర్వహించి ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.