https://oktelugu.com/

Bandla Ganesh: అతడే తెలంగాణ సీఎం.. తేల్చేసిన బండ్ల గణేష్

2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని బండ్ల గణేష్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను బ్లేడుతో మెడ కోసుకుంటానని చాలెంజ్ కూడా చేశారు.

Written By: Dharma, Updated On : November 9, 2023 10:16 am
Bandla Ganesh

Bandla Ganesh

Follow us on

Bandla Ganesh: తెలంగాణ ఎన్నికల ముంగిట నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలపై ఫోకస్ పెడతారు. కానీ అటువంటిది ఈసారి ఆయన కనిపించలేదు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ.. దక్కలేదు. ఈసారి అటువంటి ప్రయత్నం ఏమి చేయలేదు. దీంతో బండ్ల గణేష్ రాజకీయాలకు దూరంగా ఉన్నారన్న కామెంట్స్ వినిపించాయి. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చంద్రబాబు అరెస్ట్ నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ఎన్నికల కోసం కీలక వ్యాఖ్యలు చేశారు.

2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని బండ్ల గణేష్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను బ్లేడుతో మెడ కోసుకుంటానని చాలెంజ్ కూడా చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. దీంతో ప్రత్యర్థులకు బండ్ల గణేష్ కార్నర్ అయ్యారు. ఆ ఒట్టు తీసి గట్టును పడేసిన బండ్ల గణేష్ పలు సందర్భాల్లో కేసీఆర్ పాలనను మెచ్చుకున్నారు. ఏపీ రాజకీయాలపై సైతం తరచూ ఏవేవో మాట్లాడుతుండేవారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న బండ్ల గణేష్.. ఏపీలో మాత్రం జనసేనకు మద్దతుగా నిలుస్తుంటారు. పవన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే కౌంటర్ అటాక్ చేస్తుంటారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు మద్దతుగా బండ్ల గణేష్ నిలుస్తూ వస్తున్నారు. ఇలా రాజకీయాల విషయంలో భిన్న వైఖరితో ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బండ్ల గణేష్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా? అని అందరూ ఆరా తీశారు. కానీ ఆయన పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరోసారి జోష్యాలు చెప్పడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని.. డిసెంబర్ 9న తనకి ఇష్టమైన వ్యక్తి సీఎం గా ప్రమాణం చేయబోతున్నారని తేల్చి చెప్పడం విశేషం.

నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో తెలంగాణ సీఎంగా టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అవుతారని.. తాను ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉన్నా.. పార్టీ కోసం తెర వెనుక తాను ఎంతగానో కృషి చేస్తున్నానని బండ్ల గణేష్ చెప్పడం విశేషం. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి అన్ని చేశామని చెబుతున్న పాలకులు.. వారి కుటుంబం మొత్తం రోడ్డుపైకి వచ్చిందంటే.. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో బలోపేతం అయిందో అర్థమవుతుందన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఎల్బీ స్టేడియంలో సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని బండ్ల గణేష్ తేల్చి చెప్పడం విశేషం. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బిజెపితో పొత్తు పెట్టుకుని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఇప్పటికే పవన్ ప్రకటించారు. కానీ బండ్ల గణేష్ జనసేన గురించి ప్రస్తావించకపోవడం విశేషం.అయితే ఈసారి బండ్ల గణేష్ అంచనా ఫలిస్తుందో? లేదో? చూడాలి మరి.