Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల కర్కశత్వంగా వ్యవహరిస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని.. వివిధ శాఖల్లో అనేక పోస్టులు పెండింగ్ లో ఉన్నాయని, ముఖ్యమంత్రి ఎందుకు సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. పదేండ్ల పాటు ఉద్యోగ నియామకాలు లేకపోతే నిరుద్యోగుల జీవితాలు ఏం కావాలని అడిగారు. ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో చిత్తశుద్ది ఉంటే వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 1600 గ్రూప్-1 పోస్టులు ఖాళీ ఉన్నాయని వివరించారు. పదేళ్లుగా గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల కాకపోవడం దారుణమని మండిపడ్డారు. గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులకు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఒక్కో ఐఏఎస్ అధికారి 3, 4 పోస్టులకు ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారని గుర్తుచేశారు.
Also Read: ‘బండి’ని టార్గెట్ చేసిన ఆ వర్గం.. తెలంగాణ బీజేపీకి బీటలు..?
రాష్ట్రంలో 4 వేల గ్రూప్ -2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రెండు వేల గ్రూప్ -3 పోస్టులు, 40 వేల గ్రూప్ -4 పోస్టులు ఖాళీ ఉన్నాయని లెక్కలతో సహా చెప్పుకొచ్చారు. ఉద్యోగులు లేకనే ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదన్నారు. పేదలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని చెప్పారు. 25 ఏళ్లుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలు భర్తీ చేయలేదని విమర్శించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన నిరుద్యోగులు అనేక మంది ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, కొంత మందికి వయోపరిమితి కూడా దాటిపోతోందని సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ డమాండ్ చేశారు.
Also Read: కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్.. బండి సంజయ్ లాజిక్ తో కొట్టాడే..