
సినీ, రాజకీయ రంగాలలో ఉప్పు, నిప్పుల్లా ఉన్న రెండు వర్గాలు ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు విజయవంతం అయ్యేలా కనిపించడం లేదు. ఇటీవల తెలంగాణలో సినీ పెద్దలు ముఖ్యమంత్రి తో అయిన భేటీకి బాలకృష్ణ ను పిలవలేదు. ఆ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చిరంజీవి తలపెట్టిన భేటీకి బాలయ్య వస్తాడా అన్న సందిగ్దత నెలకొంది.
ఈ నెల 9వ తేదీన సీఎం జగన్ ను కలిసేందుకు అనుమతి లభించడంతో ఈ విషయంపై నిర్మాత సి.కళ్యాణ్ సినీ ప్రముఖులకు సమాచారం ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యకు సమాచారం ఇచ్చి ఆహ్వానించారు. తన పుట్టినరోజు కాబట్టి రాలేనంటూ బాలయ్య సున్నితంగా తిరస్కరించారు. ప్రతిపక్షంలో ఉన్న బాలయ్యకు ఏ కార్యక్రమాలు లేకపోయినా జగన్ ను కలిసేందుకు వచ్చే అవకాశం లేదని కొందరు వాదిస్తున్నారు. సినీ ప్రముఖులు మాత్రం ముందుగానే సమాచారం ఇచ్చి వారి తప్పు లేదనిపించుకున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులని ఆంద్రప్రదేశ్ సీఎం జగన్‌కు సినీప్రముఖులు వివరించనున్నారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలని పాటిస్తూ షూటింగ్ నిర్వహిస్తామనే విషయాన్ని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు ఇండస్ట్రీ పెద్దలు. ఇప్పుడు జగన్‌తోను పలు కీలక విషయాలపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తుంది. సినీ పరిశ్రమను ఆదుకునేందుకు సహకారం అందించాలని కోరనున్నారు.