Hindupuram: రాయలసీమలో టిడిపికి అనంతపురం ఒకటే అనుకూలమైన జిల్లా. 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు టిడిపి కైవసం చేసుకున్న జిల్లా కూడా ఇదే. కానీ గత ఎన్నికల్లో జగన్ వ్యూహానికి టిడిపి చతికిల పడింది. ఒక్క హిందూపురం అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలను సైతం కైవసం చేసుకుంది. అయితే దీని వెనుక పెద్ద కసరత్తే చేసింది. గత ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేసింది. అది బాగా వర్క్ అవుట్ అయింది. అందుకే మరోసారి అదే ఫార్ములాని కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. హిందూపురం అసెంబ్లీ సీట్లు కూడా బీసీలు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ దీపిక అనే మహిళను ఇన్చార్జిగా ప్రకటించారు. ఆమె కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో కురుబుల బలం గట్టిగానే ఉంది.
ముందుగా ఇక్కడ కురుబసామాజిక వర్గానికి చెందిన నవీన్ నిశ్చల్ ను ఇంచార్జిగా ప్రకటించారు. కానీ ఆయన నెగ్గలేకపోయారు. ఆ తరువాత ఇక్బాల్ తెరపైకి వచ్చారు. ఆశించినంత ప్రభావం చూపలేకపోయారు. నామినేటెడ్ పోస్ట్ కేటాయించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈసారి కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికను ఇన్చార్జిగా ప్రకటించారు. దీని వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
దీపిక కన్నవారు కురుబ.అత్తింటి వారు మాత్రం రెడ్డి సామాజిక వర్గీయులు.హిందూపురం పరిసర ప్రాంతాల్లో రెడ్డి సామాజిక వర్గం కూడా గణనీయంగా ఉంది. అటు కురుబ, ఇటు రెడ్డి సామాజిక వర్గం ఆశీస్సులు లభిస్తే దీపిక గెలుపు సునాయాసం అవుతుందని వైసిపి భావిస్తోంది. అదే జరిగితే హ్యాట్రిక్ కొట్టాలన్న బాలకృష్ణ ఆశలు నీరుగారక తప్పదు.