ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతల స్వీకరించిన సాయంత్రం వరకే ఆఫీసర్ నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలకు తెరలేపారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తూ ప్రకటన చేశారు. అయితే.. దీనిపై అటు జనసేన, ఇటు టీడీపీలు భగ్గుమన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే ఏకంగా పరిషత్ ఎన్నికలకు బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటన చేసేశారు.
బాబు ప్రకటనను చూస్తే.. పరిషత్ ఎన్నికలు రాష్ట్రంలో అంత ఫెయిర్‌గా జరిగే అవకాశాలు లేనట్లుగా ఆయనలో అనుమానాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని .. అందుకే ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆరు రోజుల్లో ఎన్నికలు జరపాలని సీఎం జగన్ అంటారని.. మంత్రులు తేదీలు ప్రకటిస్తారని మండిపడ్డారు. గత ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణలో ఏ మాత్రం సహకరించని నీలం సాహ్ని.. ఇప్పుడు ఎస్ఈసీగా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని.. కఠిన నిర్ణయమే అయినా తప్పలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇప్పటికే పరిషత్ ఎన్నికల్లో భాగంగా.. 20 శాతానికి పైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. కడప లాంటి చోట్ల జడ్పీ పీఠం వైసీపీ వశమైంది. ఎంపీటీసీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నామిషన్లపైనే.. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఏకగ్రీవాలపై ఫిర్యాదులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే.. హైకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. చివరికి ఆయన రిటైరయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి.. ఎలాగూ ఎన్నికలకు వెళ్లడం ఖాయం. ఇక జనసేన, టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తే.. ఏపీలోని మండల, జిల్లా పరిషత్‌లన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలోనే చాలా చోట్ల.. బీజేపీ, జనసేన నేతలు కూడా నామినేషన్లు వేయలేకపోయారు. అయితే ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో పోటీ మాత్రం జరగనుంది. పోలింగ్ కూడా ఉంటుంది. మొత్తంగా .. నిమ్మగడ్డ హయాంలో ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలు వచ్చినా ఎన్నికలకు సిద్ధపడిన టీడీపీ.. నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టాక బహిష్కరించడం వెనుక ఉన్న మర్మం ఏంటో అందరికీ అర్థం అవుతూనే ఉంది.