Viveka Murder Case
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మూడు రోజుల కిందట దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. దీనిపై పూర్తిస్థాయి విచారణ సోమవారం చేపడతామని స్పష్టం చేసింది. దీంతో నేడు ఏం జరగబోతోంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఈ కేసు విచారణను జోరుగా సాగిస్తున్న సిబిఐ అధికారులు ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్టు చేసి విచారించారు. దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ప్రస్తుతం ఈ కేసు తిరుగుతోంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే దాదాపుగా ఈ కేసు సుఖాంతం అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ తెలంగాణ హైకోర్టును అవినాష్ రెడ్డి కొద్ది రోజుల కిందట ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే సిబిఐ అధికారుల విచారణకు మాత్రం సహకరించాలని అవినాష్ రెడ్డికి కోర్టు స్పష్టం చేసింది.
రెండున్నర రోజులు మాత్రమే విచారించిన సిబిఐ అధికారులు..
అవినాష్ రెడ్డిని విచారించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ముందు నుంచి కోరుతూ వచ్చిన సిబిఐ అధికారులు.. రెండన్నర రోజులు మాత్రమే అవినాష్ రెడ్డిని విచారించారు. రెండు రోజులపాటు పూర్తిగా విచారించిన సిబిఐ అధికారులు.. అవినాష్ రెడ్డి నుంచి రాతపూర్వక సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మూడో రోజు సగం రోజు మాత్రమే విచారించారు. అయితే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని పూర్తిస్థాయిలో విచారించకపోవడానికి గల కారణాలు ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండు రోజులపాటు పూర్తిగా, ఒకరోజు సగం విచారించిన సిబిఐ అధికారులకు అవినాష్ రెడ్డి నుంచి రావాల్సిన సమాధానం వచ్చినందునే.. తర్వాత విచారణకు పిలవలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అరెస్టు చేసే అవకాశం ఉందా.?
అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు తీర్పును డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ సాగనున్న నేపథ్యంలో.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి కీలక ఆదేశాలను సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఒకవేళ అరెస్టు చేయమని చెప్పకపోయినా.. అవినాష్ వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపైన అయినా సుప్రీంకోర్టు సిబిఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి అన్నదానిపైన కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా బెయిల్ పై ఉంటూనే అవినాష్ రెడ్డిని విచారణ చేయాలా, అరెస్టు చేసి విచారణ చేయాలా..? అన్న దానిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Viveka Murder Case
పులివెందులకు వెళ్లిన సిబిఐ అధికారుల బృందం..
వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సాగిస్తున్న సిబిఐ అధికారులు బృందం తాజాగా రెండు రోజుల కిందట పులివెందులకు వెళ్లి మరోసారి కీలక అంశాలను క్రాస్ చెక్ చేసుకున్నట్లు తెలిసింది. గతంలో విచారణ సాగించిన రెండు అధికారుల బృందాలు కూడా పులివెందులకు వెళ్లి ఆధారాలను సేకరించారు. అయితే ప్రస్తుతం విచారణ సాగిస్తున్న అధికారుల బృందం కూడా మరోసారి పులివెందులకు వెళ్లి హత్య జరిగిన ప్రాంతాలను పరిశీలించి ఇప్పటికే సేకరించిన ఆధారాలను క్రాస్ చెక్ చేసుకున్నట్లు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు సిబిఐ అధికారులు సేకరించిన ఆధారాలను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అవినాష్ రెడ్డి కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్నటువంటి సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు రెండు గంటలపాటు విచారణ చేశారు. దీంతో సుప్రీంకోర్టుకు సిబిఐ ఏం చెప్పబోతోంది అన్నదానిపైనా కూడా ఆసక్తి నెలకొంది. కొత్తగా నియమితులైన సిబిఐ అధికారుల బృందం మళ్లీ పులివెందులకు వెళ్లడం కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
జైలుకు వెళ్తాడా..? అవినాష్ పాత్రపై మరో విషయం బయటకు వస్తుందా..?
సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సిబిఐ అధికారులకు ఎటువంటి ఆదేశాలు రాబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అరెస్టు చేసి విచారణ చేయాలని సిబిఐ ఆదేశిస్తుందా..? లేకపోతే మరో అంశం కొత్తగా బయటకు వస్తుందా అన్నది మరికొద్ది నిమిషాల్లో తేలనుంది. ఏది ఏమైనా నాలుగేళ్లుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన వివేకానంద రెడ్డి హత్య కేసు దాదాపు ముగింపు దశకు వస్తుండడంతో ఈ కేసులో దోషులుగా ఉన్నవారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ కేసు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకు కారణం అవుతుందన్న విశ్లేషణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోందో. ఇదిలా ఉంటే మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టులో ఈ విచారణ జరగనుంది.
Web Title: Avinashs fate will be revealed today in vivekas murder case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com