
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. అసోం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే.. 64 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతుండగా.. ఈ సారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది కాంగ్రెస్.
అసోంను ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే పాలించింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన హస్తం పార్టీ.. అధికారం కోల్పోయింది. 61 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టింది. అయితే.. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారుతుండడంతో.. ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది నాయకత్వం.
అందుకే.. రాహుల్ తోపాటు సోదరి ప్రియాంక కూడా అసోంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేశారు. ఇటు బీజేపీ నేతలు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. మోడీ, అమిత్ షా ద్వయం పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. అయితే.. పౌరసత్వ సవరణ చట్టం తమకు లాభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీజేపీ నేతలు మాత్రం వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు చేశారు.
మొత్తం మూడు దశల్లో ఇక్కడ ఎన్నిక జరిగింది. ప్రీ-పోల్ సర్వేలు ఎన్డీఏకే అధికారం వస్తాయని చెప్పాయి. ఆ కూటమికి 69 స్థానాలు వస్తాయని, యూపీఏకు 56 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే.. పోలింగ్ నాటికి పరిస్థితి మారిపోయిందని కూడా అంటున్నారు. దీంతో.. ఎవరు అధికారంలోకి వస్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరి, ఏం జరుగుతుందన్నది తెలియాలంటే.. మే 2 వరకు వెయిట్ చేయాల్సిందే.