
ఆయుర్వేద వనమూలిక అశ్వగంధ గురించి ఏదో ఒక సందర్భంలో ప్రతివారూ వినే ఉంటారు. దీనిలోని ఔషధ గుణాల గురించి సామాన్యులకు దాదాపుగా తెలియదుగానీ.. ఈ పేరు మాత్రం సుపరిచితమే. అయితే.. ఇప్పుడు ఇదే మూలికతో కరోనా మహమ్మారికి చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. బ్రిటన్ కు చెందిన ‘‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్’’త కలిసి పరిశోధనలు చేయబోతోంది. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది.
త్వరలో క్లినికల్ ట్రయల్స్ కూడా చేపట్టబోతున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ తనూజా మనోజ్ మాట్లాడుతూ… క్లినికల్ ట్రయల్స్ కోసం ఔత్సాహికులైన రెండు వేల మందిని ఎంపిక చేయనున్నట్టు ఎప్పారు. వీరిని వెయ్యి మంది చొప్పున రెండు గ్రూపులుగా చేస్తారని తెలిపారు. ఇందులో ఒక గ్రూపునకు 3 నెలలపాటు అశ్వగంధ మాత్రలు, మరో గ్రూపునకు ప్లాసిబో ఇస్తారు. అంటే.. నిజమైన అశ్వగంధ మాత్రలు కాకుండా.. దానిలాగానే ఉండే సాధారణ పదార్థాన్ని అందజేస్తారు.
రోజుకు రెండు టాబ్లెట్ల చొప్పున 3 నెలలపాటు వీరికి ఈ ట్యాబ్ లెట్లను అందజేస్తారు. ఈ క్రమంలో మందు పనితీరుతోపాటు మాత్రలు వేసుకున్న వారి మానసిక పరిస్థితి, శారీరక స్థితి, సప్లిమెంట్ ఉపయోగం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ పరిశోధన మొత్తం పూర్తి కావడానికి సుమారు 16 నెలల కాలం పడుతుందని చెప్పారు.
ఈ ప్రయోగం గనక సక్సెస్ అయితే.. వైరల్ ఇన్ఫెక్షన్లను నిర్మూలించడంలో అశ్వగంధ సమర్థంగా పనిచేసినట్టేనని మనోజ్ అన్నారు. అంతేకాకుండా.. అశ్వగంధకు సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పారు. ఒకవేళ కరోనాను నిర్మూలించే శక్తి గనక అశ్వగంధకు ఉంటే.. ఈ చెట్టు విరివిగా లభిస్తుంది కాబట్టి.. తక్కువ కాలంలోనే భారీగా మెడిసిన్ ఉత్పత్తి చేయొచ్చని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.