Arvind Kejriwal congratulates people of punjab : పంజాబ్ లో ఘన విజయం తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమరోత్సాహం ప్రకటించారు. దేశంలో విప్లవం రావాలని.. పంజాబ్ కు ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో యావత్ దేశానికి స్వాతంత్ర్యం వస్తుందన్నారు. పంజాబ్ లో ఆప్ గెలుపు ఖచ్చితంగా ముందుండి నడిపించిన భగవంత్ మాన్ దేనని కేజ్రీవాల్ కొనియాడారు. పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటీష్ వాళ్లను తరిమికొడితే సరిపోదని.. వ్యవస్థను మార్చాలని ఆనాడు భగత్ సింగ్ చెప్పాడని గుర్తు చేశారు.

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 117 సీట్లున్న పంజాబ్ లో ఆప్ ఏకంగా 91 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘పంజాబ్ ఎన్నికల్లో సీఎంలుగా చేసిన బాదల్, చన్నీ, కెప్టెన్ కూడా ఆమ్ ఆద్మీ ధాటికి ఓడిపోయారని’ ఎద్దేవా చేశారు. సీఎం చరణ్ జీత్ చన్నీ సింగ్ ను ఎవరు ఓడించారని ప్రశ్నించారు. మొబైల్ రిపేర్ దుకాణంలో చిన్న పనిచేస్తున్న ఓ వ్యక్తి ఓడించారని తెలిపారు.
ఇక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సిద్దూను ఓడించిన వ్యక్తి ఒక మహిళా వాలంటీర్ అని ఆమ్ ఆద్మీ ప్రభంజనంలో వారంతా సామాన్యుల చేతుల్లో కొట్టుకుపోయారని కేజ్రీవాల్ తెలిపారు. పెద్ద పెద్ద నేతలే ఈ దేశాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
తమ పార్టీ విజయం రహస్యం ఎలాంటి అవినీతి లేకుండా పాలించడమని.. చిన్న పిల్లలకు స్కూళ్లు ఏర్పాటు చేశామని.. పేదల చిన్న పిల్లల చదువుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా చాలా మంది ప్రయత్నించారని.. చాలా కుతంత్రాలు చేశారని ఆరోపించారు. తనను ఉగ్రవాది అన్నారని.. కానీ క్రమశిక్షణ వాదిని అని ప్రజలు నిరూపించారన్నారు.
పేద పిల్లలకు ఉన్నత విద్య రావాలని.. ఇన్ని సవంత్సరాలైనా మెడికల్ విద్య కోసం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాలకు వెళ్లాల్సి వస్తోందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత, మహిళలు, కిసాన్, ఇతర కార్మికులు , ఉద్యోగులు ఆప్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. పంజాబ్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని.. అవినీతికి పాల్పడవద్దని ఆప్ కార్యకర్తలకు సీఎం కేజ్రీవాల్ సూచించారు.