Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసునకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటు చంద్రబాబు న్యాయవాదులతో పాటు ప్రభుత్వ న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. ప్రధానంగా 17 ఏ సెక్షన్ చుట్టూ వాదనలు కొనసాగాయి. సెక్షన్ 17a వర్తిస్తున్నా గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేసిన విషయాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్ట్.. హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్పించిన అన్ని వివరాలను.. ఇక్కడ కూడా సమర్పించాలని సూచించింది. అందుకు సమయం కావాలని సిఐడి కోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేసిన సంగతి తెలిసిందే. దానిని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్ర న్యాయమూర్తిని కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కేసులో సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా? లేదా? అన్న దాని పైనే వాదనలు సాగాయి. ముఖ్యంగా సెక్షన్ 17 ఏ పై గతంలో యశ్వంత్ సిన్హా కేసుతో పాటు పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన లాయర్లు ఉదహరించారు. 2018 జూలై 18 తర్వాత నమోదైన కేసుల్లో సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని.. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూధ్ర, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ సైతం గట్టి వాదనలు వినిపించ గలిగారు. చంద్రబాబు సెక్షన్ 17 వర్తించదన్నారు. నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యమని.. సెక్షన్ 17 ఏ వచ్చాక నేరం జరగని విషయాన్ని గుర్తు చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఇరువైపులా లాయర్లకు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
కేసులో వాదనలు విన్నాక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది స్పందించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లను తమకు అందించాలని సిఐడి కి ఆదేశించారు. ఈ కేస్ మెరిట్ కంటే సెక్షన్ 17 ఏకే వాదనలు పరిమితం చేస్తామని కూడా ధర్మాసనం తెలిపింది. అయితే ధ్రువపత్రాలు సమర్పించేందుకు తమకు సమయం కావాలని సిఐడి కోరడంతో.. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.