Arya Samaj Marriage: ఆర్య సమాజ్ లో జరుగుతున్న వివాహాలపై న్యాయస్థానాలు సరికొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మనదేశంలో ఇటీవల కాలంలో పలు న్యాయస్థానాలు వెలుపరించిన తీర్పులు ఆర్య సమాజ్ లు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాల సచ్చీలతను లేవనెత్తుతున్నాయి. మతాంతర వివాహాలు, నమోదు కాని వివాహాలకు సంబంధించిన కేసులు తమ ఎదుటకు వచ్చినప్పుడు న్యాయస్థానాలు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.. 2022లో తమ దృష్టికి వచ్చిన ఓ కేసులో ఆర్య సమాజ్ కు వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే అధికారం లేదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు విడుదల చేసింది. ” ఆర్య సమాజ్ వారు ఇచ్చే వివాహ ధ్రువీకరణ పత్రాలు కన్వర్షన్ అఫిడవిట్లను కలిగి ఉండాలి. మనదేశంలో చట్టాల ప్రకారం ఆ వివాహం రిజిస్టర్ కావాలి. అప్పుడే అది చట్టబద్ధమవుతుందని” అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ” ఆర్య సమాజ్ లో వివాహం జరిపిస్తున్నప్పుడు.. పెళ్లి క్రతువులో సాక్షులుగా ఉన్న వారిని ధ్రువీకరించాలి. పెళ్లి జరుగుతున్నప్పుడు వెంట వచ్చిన వారిని నిర్ధారించాలని” ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
క్లిష్టతరం
న్యాయస్థానాలు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే వారి పరిస్థితిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అనుమానాస్పద వివాహాలపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అనధికారికంగా ఆర్య సమాజ్ సంస్థలు నిర్వహిస్తున్న పాత్రను ప్రశ్నించాయి. “మానవ అక్రమ రవాణా, లైంగికంగా జరుగుతున్న దోపిడి, బలవంతపు వివాహాలకు” ఆర్య సమాజ్ లో జరిగే వివాహాలు నాంది పలుకుతున్నాయని అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాహ ధ్రువీకరణ పత్రాల జారీలో ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదని మండిపడింది. అంతేకాదు ఆర్య సమాజ్ , ఇతర ట్రస్టులపై విచారణ నిర్వహించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు మతాంతర వివాహాలకు సంబంధించి ఆర్య సమాజ్ ట్రస్ట్ లపై న్యాయస్థానాలు అనేక సందేహాలను వ్యక్తం చేశాయి. ఇటీవల ఓ కేసు విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆర్య సమాజ్ నిర్వాహకులపై అనేక ప్రశ్నలు సంధించింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన ఆర్య సమాజ్ ట్రస్ట్ మతమార్పిడి, వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది. అయితే అవి నల్ అండ్ వాయిడ్(చెల్లుబాటు కావు) అని కోర్టు ప్రకటించింది. అంతేకాదు హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహ ధ్రువీకరణ పత్రాలను ఆర్య సమాజ్ ట్రస్ట్ లు జారీ చేస్తున్నప్పుడు కొన్ని ఆచారాలను, సంప్రదాయాలను, పద్ధతులను పాటించాలని కోర్టులు సూచించాయి. ముఖ్యంగా హిందువుల వివాహాలకు సంబంధించి సప్తపది (అగ్ని చుట్టూ ఏడూ అడుగులు నడవడం) వంటి ఆచారాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నాయి.
ఇవి చేయాల్సిందే
మనదేశంలో ఉన్న చట్టాల ప్రకారం వివాహాన్ని లీగల్ గా గుర్తించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. ఆర్య సమాజ్ లో జరుగుతున్న వివాహాలను హిందూ వివాహ చట్టం కింద పరిగణిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ ప్రయోజనాలు లభించాలంటే కచ్చితంగా రిజిస్ట్రార్ వద్ద వివాహాన్ని నమోదు చేసుకోవాలి. హిందూ వివాహ చట్టం కేవలం హిందువులకు మాత్రమే కాదు సిక్కులకు, జైనులకు, బౌద్ధులకు చెల్లుబాటు అవుతుంది. అయితే హిందువులు కాకుండా ఇతర మతస్తులకు వారి సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరుపుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యేక వివాహ చట్టం ఏం చెబుతోందంటే..
మతానికి విరుద్ధంగా జరిగే వివాహాలకు సంబంధించి స్వీకరించే అభ్యంతరాల విషయంలో 30 రోజులపాటు నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఇక హిందూ వివాహ ధ్రువీకరణ చట్టం 1937 కులాంతర ఆర్య సమాజ్ వివాహాలకు ఓకే చెబుతున్నప్పటికీ.. సరైన విధానాలు లేకుండా జారీ చేసిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కావాలని కోర్టులు చెబుతున్నాయి. అంతేకాదు ఆర్య సమాజ్ ప్రతినిధులు చేస్తున్న అనధికారిక వ్యవహారాలపై దృష్టిసారిస్తామని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నాయి.