
ఎంతో కాలంగా ఏపీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న వారికి ఆ సంస్థ షాకిచ్చింది. కరోనా కష్ట కాలంలో ఒకేసారి ఆరువేల మందిపై వేటు వేసింది. శుక్రవారం నుంచి విధులకు హాజరు కావొద్దంటూ వారికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా ఇప్పటి వరకు అందలేదు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం పై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరును ఖండిస్తున్నాయి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సంస్థను నష్టాల నుంచి గట్టెకించే మార్గాలను ఉన్నతాధికారులు అన్వేషిస్తున్నారు. బస్సుల్లో సిట్టింగ్ కెపాసిటీ భారీగా తగ్గించడం వల్ల తలెత్తే ఇబ్బందులను పూడ్చుకునేందుకు సరుకు రవాణాను మరింత పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.