Mahesh Kumar Goud: బండి సంజయ్ ను పదవి నుంచి భారతీయ జనతా పార్టీ తొలగించింది. కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. ఇప్పటికే పార్టీ తనకు కల్పించిన కారు, ఇతర సౌకర్యాలను బండి సంజయ్ తిరిగి పంపించారు. కొన్ని కొన్ని కలలు సాకారం అయ్యే లోగానే కల్లలు అయిపోతాయని ఆయన ట్విట్టర్లో నిర్వేదం వ్యక్తం చేశారు. మీడియా కంట పడకుండానే వెళ్ళిపోయారు. బండి సంజయ్ తొలగింపు పట్ల సొంత పార్టీలో ఒక వర్గం నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పార్టీ గెలిచే దశలో ఉన్నప్పుడు ఇలా అధ్యక్షుడి మార్చి తప్పు చేశారనే భావన కూడా పలువురిలో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు బండి సంజయ్ మార్పు కేవలం సొంత పార్టీలో మాత్రమే కాదు.. విపక్ష పార్టీలోనూ ఆగ్రహానికి కారణమవుతోంది.
బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు పట్ల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉన్న భారతీయ జనతా పార్టీలో.. ఆ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ అధ్యక్షుడికి అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గత మూడు సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేసి సున్నా నుంచి బిజెపిని భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం అనే దిశగా నడిపించారని కొనియాడారు. ఎన్నికలకు మరొక మూడు నెలలు ఉన్న సమయంలోనే బండి సంజయ్ ని మార్చి భారతీయ జనతా పార్టీ పెద్ద తప్పు చేసిందని ఆయన వివరించారు. వెనుకబడిన కులాలకు చెందిన నాయకుల పార్టీ అని చెప్పుకునే బిజెపికి ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని ఆయన దుయ్య పట్టారు.
కెసిఆర్ కోరిక మేరకే కిషన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా నియమించిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఆయన హయాంలో ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసని, 2018 లో జరిగిన ఎన్నికల్లో కనీసం కిషన్ రెడ్డి కూడా గెలవలేదని ఆయన ఉదాహరించారు. ఇలాంటి దుస్థితి నుంచి భారతీయ జనతా పార్టీని ఒక ప్రబల శక్తిగా మార్చిన బండి సంజయ్ కి ఇలాంటి గౌరవం ఇవ్వడం బిజెపి పెద్దలకే చెందుతుందని ఆయన విమర్శించారు. ” ప్రధానమంత్రి ఉదయం లేస్తే బీసీల జపం చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి ఉండదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక అధ్యక్షుడిని తొలగించి ఆ పార్టీ తన కపటత్వాన్ని నిరూపించుకుంది. ఇలాంటి పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందంటే ఎలా నమ్మాలి?” అని ఆయన విమర్శించారు. కాగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. కాగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమర్థించడం ఇక్కడ విశేషం.