అడిగినదీ.. అడగనిదీ అన్నీ ప్రకటించేస్తున్న ఏపీ సీఎం జగన్ ను చూసి కొందరు ఆహా.. ఓహో అంటున్నారు. కానీ.. ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల్లో మాత్రం ఒక విధమైన గుబులు కొనసాగుతోంది. జగన్ కొత్త నిర్ణయాలు ప్రకటించిన ప్రతిసారీ అది పెరుగుతూ వస్తోంది. వారి ఆందోళనకు పెద్ద కారణమే ఉంది. అదే నిండుకుంటున్న ఖజానా!
విభజన సమయంలోనే లోటు బడ్జెట్ తో ఏర్పడింది రాష్ట్రం. చంద్రబాబు హయాంలో ఆ లోటు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు జగన్ హయాంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోయినప్పటికీ.. సంక్షేమం విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు జగన్.
ఇప్పటి వరకు జగన్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు 70 వేల కోట్లను ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అందినకాడల్లా అప్పులు తెచ్చి.. బండి నడిపిస్తున్నారు. అయితే.. ఇలా ఎంతకాలం అన్నదే ప్రశ్న. ఖజానా లోటు ఇదేవిధంగా కొనసాగితే.. రాబోయే రోజుల్లో అప్పులు కూడా పెద్దగా పుట్టే పరిస్థితి లేదని అంటున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుంది అన్నది అనుమానమేనని అంటున్నారు. మరి, ఈ భారాన్ని ఎలా మోయాలి? అన్నదే ప్రభుత్వ నేతల ఆందోళన.
ఒకవేళ సంక్షేమ పథకాల్లో కోత విధిస్తే.. జనాల్లో అసంతృప్తి ఖాయం. ఇవ్వాల్సింది ఆలస్యంగా ఇచ్చినా జనం ఊరుకుంటారేమోగానీ.. ఇచ్చేదాంట్లోంచి కోత పెడితే మాత్రం సహించలేరు. దీంతో.. ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారట సీఎం. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. సంక్షేమ పథకాలను ఎత్తేసే ఆలోచన లేదట. కానీ.. లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఇందుకోసం ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలా? అని మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.
ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కాబట్టి.. వచ్చే రెండేళ్ల వరకు కొత్త పథకాలు ఏవీ ప్రవేశపెట్టొద్దని డిసైడ్ అయ్యారట. ఉన్నవాటిల్లోనూ పలు కారణాలను చూపి కొంత మంది లబ్ధిదారులను ఏరివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా రెండేళ్లు గడిపిన తర్వాత చివరి ఏడాదిలో కొత్త పథకాలను ప్రవేశపెట్టి.. ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. మరి, ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందన్నది చూడాలి.