AP New Disticts: విభజించి పాలించు అన్న సామెత ఊరికే పుట్టలేదు. విభజిస్తేనే అది బలహీనమవుతుంది.. దానిపై మన పెత్తనం ఉంటుంది. ఐక్యంగా ఉంటే ఎదుర్కోవడం కష్టం. వారిని సంతృప్తి పరచడం ఇంకా కష్టం.. విడగొట్టి పడగొట్టడం బ్రిటీష్ వారి నుంచే నేర్చుకోవాలి. నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మాలతో అఖండంగా ఉన్న భారతదేశాన్ని నాలుగుదేశాలుగా విభజించి చిన్నగా మార్చేశాడు. అఖండ భారతదేశం అలానే ఉంటే ఇప్పుడు చైనాను తలదన్నేవాళ్లం. కానీ విభజించి మనలో మనకే గొడవలు పెట్టి బ్రిటీష్ వారు చోద్యం చూశారు. దానర్థం విడిపోతే బలం సగం అవుతుంది.. అదేసమయంలో వారి హక్కులు వారికి దక్కుతాయి.
ఉమ్మడి ఏపీ విడిపోయాక తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. వనరులున్నది కాబట్టి ధనిక రాష్ట్రంగా ఎదిగింది. వనరులు లేవు కాబట్టి ఏపీ విభజనతో నష్టపోయింది. విభజనతో రెండు రాష్ట్రాల్లో అక్కడి స్థానికులకు, కొత్త వారికి రాజ్యాధికారం, ఉపాధి, రాజకీయ ఉపాధి కూడా లభించింది. కొత్త కొత్త వారు నేతలుగా ఎదిగారు. తెలంగాణలో 33 జిల్లాలను చేసి పాలనను ప్రజలకు చేరువ చేశాడు కేసీఆర్. ఇన్నాళ్లు కలెక్టరేట్ వెళ్లాలంటే సద్ది కట్టుకొని పొద్దున వెళితే రావడానికి సాయంత్రం పట్టేది. కానీ ఇప్పుడు 40 కి.మీలలోపే దాన్ని వచ్చేసరికి ప్రజలకు కష్టాలు తీరాయి.
ఇప్పుడు ఏపీ కూడా అదే బాటపట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను జగన్ సర్కార్ విభజించింది. ఈ కొత్త జిల్లాలతో పాలన ప్రజలకు చేరువ అవ్వడమే కాదు.. కొత్తగా నేతలు పుట్టుకొస్తారు.? ఎమ్మెల్యేలకు ఈ కొత్త జిల్లాల వారీగానే మంత్రి పదవులు దక్కనున్నాయి. విశాఖ, విజయనగరం మధ్యలోని అరకు లాంటి అటవీ విస్తీర్ణం అధికం ఉన్న జిల్లాలో గిరిజనులు, మారుమూల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందడం చాలా ఆలస్యమవుతోంది. ఇప్పుడు కొత్త జిల్లాల రాకతో ఆ సమస్యలు తీరనున్నాయి. తమకు దగ్గరగా ఉన్న జిల్లా కేంద్రం నుంచి వారు లబ్ధి పొందనున్నారు.
ఇక అస్తవ్యస్థంగా జిల్లాకేంద్రాలకు దూరంగా ఉన్న నియోజకవర్గాలు మండలాలను సమీప జిల్లాలో కలపడం.. కొత్త నగరాలను, పట్టణాలను జిల్లాగా మార్చడంతో అక్కడ వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. పుట్టపర్తి,రాజంపేట, అరకు లాంటి చిన్న పట్టణాలు జిల్లాలుగా మారి అభివృద్ధి బాటపట్టనున్నాయి.
మొత్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలను విభజించిన జగన్ సర్కార్ ఆ మేరకు రాజకీయంగా.. సామాజికంగా ఎంతో మందికి లబ్ధి చేకూర్చనుంది. వారికి ఉపాధి లభించనుంది. ఇక కొత్త జిల్లాల వారీగా నేతలు, ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇన్నాళ్లు అతిపెద్దదైన చిత్తూరు జిల్లా నుంచి కేవలం పెద్దిరెడ్డిలాంటి సీనియర్ మంత్రి ఉండేవారు. జగన్ తో ఆదినుంచి నడిచినా కూడా చిత్తూరు జిల్లా నగరికి చెందిన రోజాకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి నియోజకవర్గం తిరుపతి జిల్లాకు షిఫ్ట్ కావడంతో చిత్తూరు జిల్లా నుంచి రోజాకు మంత్రి పదవి ఇచ్చే సౌకర్యం ఏర్పడింది. ఇలా ఎంతో మందికి కొత్త జిల్లాలతో రాజకీయ అవకాశాలు పెరుగనున్నాయి.