Telangana BJP: తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపు, వివిధ అంశాల ఆధారంగా రాజకీయ పార్టీల ప్రణాళిక ఉంటుంది. మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నేతలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో కకా వికలం అవుతున్న కమలాన్ని గాడిలో పెట్టేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఎన్నికల కార్యచరణలో భాగంగా 26 మందితో ప్రత్యేక కమిటీని నియమించారు.. ఐదుగురు కేంద్రమంత్రులు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి ముఖ్యనేతలతో కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల బిజెపి ముఖ్య నేతలను భాగస్వామ్యం చేసి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన బిజెపి నేతలను ఈ ప్రత్యేక కమిటీలో సభ్యులుగా నియమించింది. బిజెపి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఈ కమిటీలో స్థానం కల్పించింది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బిజెపి నేతలను సమన్వయం చేసుకోవడం, అభ్యర్థుల ఎంపికలో తోడ్పాటు అందించడం, జాతీయ నేతల బహిరంగ సభల నిర్వహణలో ఏర్పాట్ల పర్యవేక్షణ వంటివి ఈ కమిటీ చేపడుతుంది.
ప్రజలకు వెళ్లేందుకు అవసరమైన కార్యక్రమాల్లో తోడ్పాటు అందించడం, హైదరాబాదు, ఇతర జిల్లాలకు చెందిన ఓటర్లను నేరుగా కలిసేందుకు కార్యాచరణ చేపడుతుంది. కమిటీలోని 26 మంది నేతలు తెలంగాణలో ఎన్నికల వరకు కూడా పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అక్టోబర్ ఐదున ఈ 26 మంది సభ్యులు ఉన్న కమిటీతో ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. కార్యాచరణ వివరిస్తారు. అక్టోబర్ 6న హైదరాబాదులో జరిగే బిజెపి విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశంలో వీరిని భాగస్వాములు చేస్తారు. మరో వైపు అక్టోబర్ మొదటి భాగం లో మహ బూబ్ నగర్, నిజామా బాద్ జిల్లాల్లో మోడీ బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు బిజెపి రంగం సిద్ధం చేస్తోంది. 26 మంది ప్రత్యేక కమిటీ సభ్యులకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ ఒక లేఖ రాశారు. అందుబాటులో ఉన్న నేతలు హైదరాబాద్ చేరుకొని అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.