
న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై హైకోర్టు మరో 44 మందికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి హైకోర్టు విచారణ చేపట్టింది. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్ ప్రభాకర్ తో సహా మరో 44 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఈ అంశంపై గతంలో 49 మందిపై హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారిలో ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. సీఐడీ అధికారులు కొందరికి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ రోజు విచారణలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై సీఐడీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. సీఐడీ అధికారి రాధిక కోర్టుకు హాజరై ఈ కేసులో తీసుకుంటున్న చర్యలను కోర్టుకు వివరించారు.