AP CID Chief Sanjay: స్కిల్ పథకానికి సంబంధించి జరుగుతున్న విచారణలో ఏపీ సిఐడి తన పరిధి దాటి పనిచేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సిఐడి చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజయ్ అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష టిడిపి విమర్శిస్తోంది. ఈ విమర్శలకు తగ్గట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్ చెలరేగుతున్నాయి. సంజయ్ వ్యవహార శైలి వల్ల అధికార పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
‘ఘంటా సుబ్బారావు అనే ఒక ప్రైవేటు వ్యక్తిని అక్రమంగా ప్రభుత్వంలోకి తెచ్చిపెట్టారంటూ” బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ ఆరోపించారు. అయితే ఆయన ఆ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్ష టిడిపి రెచ్చిపోయింది. సుబ్బారావు విషయాన్ని ప్రస్తావించిన సంజయ్ కి జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏమిటో తెలియదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ‘ఒక సాదాసీదా డాక్టర్ హరికృష్ణకు జగన్ ప్రభుత్వం ఏకంగా మూడు పోస్టులు కట్టబెట్టింది. ఆయన ప్రైవేట్ వ్యక్తి కాదా? సీఎంవోలో స్పెషల్ ఆఫీసర్ గా, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ స్పెషల్ ఆఫీసర్ గా మూడు పోస్టుల్లో ప్రభుత్వం నియమించలేదా? సంజయ్ వ్యాఖ్యల ప్రకారం ప్రైవేటు వ్యక్తి సుబ్బారావుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మూడు పోస్టులు ఇవ్వడం తప్పైతే.. హరికృష్ణకు మూడు పోస్టులు కట్టబెట్టడం కూడా తప్పే కదా” అని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు..”ప్రభుత్వ వ్యవస్థలో ఆఫీసర్ అంటే ప్రభుత్వాధికారి అని అర్థం. మూడు పోస్టులు కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే హోదాను కూడా హరికృష్ణ పేరు ముందు చేర్చడానికి జగన్ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడ లేదు. జగన్ సర్కారులో మరో వివాదాస్పద పోస్టింగ్ దువ్వూరి కృష్ణకు కూడా ఇచ్చారు. స్పెషల్ సెక్రటరీ అనే హోదాను దువ్వూరి పేరు ముందు తగిలించి మరీ సీఎం బోలో కి తీసుకున్నారు” అని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు.
వాస్తవానికి మనదేశంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు, కన్ఫర్డ్ ఐఏఎస్ లకు మాత్రమే ఈ హోదా ఉంటుంది. మరి అలాంటిది ఒక ప్రైవేటు వ్యక్తికి ఏకంగా స్పెషల్ సెక్రటరీ హోదా కట్టబెట్టడం సిఐడి చీఫ్ సంజయ్ కి తప్పు లాగా కనిపించడం లేదా అని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీఎం బోలోకి తీసుకున్న అధికారులకు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 73 విడుదల చేసింది. అందులో కల్లం అజయ్ రెడ్డి, పీవీ రమేష్, సోలోమన్ ఆరోక్య రాజ్, ధనుంజయ రెడ్డి, మురళి ఉన్నారు. వీరంతా ఐఏఎస్ లు. ఆ జీవోలోని జాబితాలో దువ్వూరి కృష్ణ పేరుని కూడా ప్రభుత్వం జత చేసింది. వాస్తవానికి కృష్ణ ఒక నాన్ ఐఏఎస్. ఒక ప్రైవేటు వ్యక్తిని ఐఏఎస్ లతో సమానంగా చూడటం ఏపీ సిఐడి చీఫ్ కి తప్పుగా అనిపించలేదా అని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. పైగా కృష్ణకు “ప్రోటోకాల్_ పీ” వర్తింపజేస్తూ ప్రత్యేక జీవో ఇచ్చారు. ఇక జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు మొత్తం దువ్వూరు కృష్ణ పని చేసిన గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి దక్కడం విశేషం. అయితే నాడు చంద్రబాబు చేసిన తప్పిదాన్ని ఏపీ సిఐడి చీఫ్ వెల్లడించిన నేపథ్యంలో.. కౌంటర్ గా టిడిపి నాయకులు దువ్వూరి కృష్ణ, హరికృష్ణ పేర్లను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. స్కిల్ కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న సిఐడి చీఫ్ సంజయ్ వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వం ఒక్కసారిగా జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని ఏపీ సీఎం జగన్ ఏ విధంగా సరి దిద్దుతారో వేచి చూడాల్సి ఉంది.