AP Cabinet Reshuffle: మంత్రివర్గ విస్తరణ తేదీ సమీపిస్తోంది. మరో మూడు రోజుల గడువే ఉంది. కేబినెట్లో ఉండేదెవరో? ఊడేదెవరో అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. మారిస్తే అందర్నీ మార్చుతారా? లేకుంటే సీనియర్లను కొనసాగిస్తారా? లేకుంటే పని తీరు ప్రాతిపదికన శాఖలో పురోగతి లేని వారిని పక్కనపెడతారా? అసలు మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉంటుంది? అన్న చర్చోప చర్చలు సాగుతున్నాయి. అసలు అధికార పార్టీ నేతలకు కూడా అంతు పట్టడం లేదు. పూర్తిస్థాయి సమాచారం బయటకు రావడం లేదు. అంతా గోప్యంగా సాగుతోంది. అయితే చాలా మంది మంత్రుల మార్పుపై ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. కొందర్ని నేరుగా పిలిపించుకున్న జగన్ త్యాగానికి సిద్ధంగా ఉండాలని సూచించడం ద్వారా వారి మార్పు అనివార్యమని చెప్పకనే చెబుతున్నారు. అయితే మొత్తం టీము టీమునే లేపేస్తున్నా.. ఆ నలుగుర్ని మాత్రం కొనసాగిస్తరాని తెలుస్తోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే జగన్ క్యాబినేట్ లో అత్యంత సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు ఆయన.

తండ్రితో రాజకీయ జీవితం ప్రారంభించినా.. కొడుకుతో కూడా ప్రయాణం సాగిస్తున్నారు. వైఎస్ అకాల మరణం తరువాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ తో అడుగులు వేశారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ కారణంగానే పెద్దిరెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకోలేదని వ్యాఖ్యలు వినిపించాయి. అటు తరువాత వైసీపీలో కీలక నేతగా పెద్దిరెడ్డి ఎదిగారు. అలా నాటి నుంచి నేటి దాకా జగన్ వెన్నంటి నడచిన పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ పరంగా ప్రతీ ఆపరేషన్ ని సక్సెస్ చేసిన చరిత్ర ఆయనకు ఉంది. అధినేత ఇచ్చిన టాస్క్ ను ఇట్టే పూర్తిచేయగలిగే నేర్పరిగా గుర్తింపు పొందారు. ఇవన్నీ పెద్దిరెడ్డికి కలిసొచ్చే అంశాలే. దీనికితోడు చంద్రబాబు చిత్తూరులో బలపడకుండా ఉండాలంటే పెద్దిరెడ్డినే ప్రయోగించాలి అన్నది జగన్ ఆలోచన. దాంతో పెద్దిరెడ్డి కంటిన్యూ అవుతారు అని అంతా భావిస్తున్నారు.
Also Read: AP Cabinet Expansion: ఏపీలో కొత్త మంత్రివర్గంపై కొనసాగుతున్న కసరత్తు
ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని సైతం దాదాపు కొనసాగింపు జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఢిల్లీ టూ తాడేపల్లి గా నిత్యం చక్కెర్లు కొడతారన్న పేరు ఉంది. నవరత్నాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అప్పులు పుట్టించడంలో ఆయన దిట్ట. ఆయన ఎన్నో ముడులు వేసి మరీ అప్పులు తెస్తున్నారు. ప్రభుత్వం వైపు లోపాలు ఉన్నా మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఆయన మార్పు అంత శ్రేయస్కరం కాదన్న భావన వ్యక్తమైంది. పైగా ఈ రెండేళ్లు ప్రభుత్వానికి ఎంతో కీలకం. కొత్తగా ఆర్థిక శాఖ నిర్వహించే వారిపై ఒత్తిడి పడడం ఖాయం. మరొకరిని ఆ పోస్టులో పెడితే ఇప్పటికి ఇప్పుడు చక్కబెట్టడం కష్టమన్న భావన ఉంది. దాంతో బుగ్గన తోనే మరో రెండేళ్ళు కధ నడపాల్సిన పరిస్థితి అనివార్యమైంది. తొలుత బుగ్గనను తప్పిస్తామని భావించినా.. చివరకు ఆయన కొనసాగింపునకు జగన్ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాకు చెందిన అదిమూలపు సురేష్ మంత్రిగా కొనసాగింపు జాబితాలో ఉండడం విశేషం. ఆయన జగన్ కు అత్యంత ఆప్తుడు. అదే జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని తొలగించి ..సురేష్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది. కానీ ఈ ప్రతిపాదనకు మంత్రి బాలినేని వ్యతిరేకించారు. కానీ జగన్ మాత్రం వెనక్కి తగ్గనట్టు తెలుస్తోంది. తనను తొలగించి సురేష్ ను కొనసాగిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటానని మంత్రి బాలినేని చెప్పిన జగన్ వినలేదు. సామాజికవర్గం లెక్కలు ఇతరత్రా చూసుకున్నా ఆదిమూలపు సురేష్పోస్ట్ పదిలం అంటున్నారు. జగన్ ఈయనను మార్చేది లేదని నిర్ణయించుకున్నారు అంటున్నారు.

క్రిష్టా జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ కొడాలి నానిని సైతం కొనసాగించేందుకే జగన్ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ అంశం బయటకు వచ్చినప్పుడు అంతటా కొడాలి నాని విషయమే చర్చనీయాంశమైంది. ఆయన్ను కొనసాగిస్తారా? లేదా? అన్నదే అందరూ ఎదురుచూస్తున్నారు. ఈయనకు పదవి ఉంటుందా లేదా అన్న దాని మీద టీడీపీ కూడా తెగ ఆసక్తిని చూపిస్తోంది. అయితే టీడీపీ పక్కలో బల్లెంలా కొడాలి నాని అయితే బెటర్ అన్న అభిప్రాయానికి సీఎం జగన్ వచ్చేశారు. పోస్ట్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబుని లోకేష్ ని ఆపాలంటే కొడాలి దూకుడే కరెక్ట్ అని వైసీపీ పెద్దలు సైతం సీఎం జగన్ కు సూచించారట. ఇక ఆ సామాజికవర్గం నుంచి చూస్తే కొడాలి నాని కంటే ఎవరూ ఫైర్ బ్రాండ్ లేరరని అంటున్నారు. అందుకే ఆ నలుగురు అయిదేళ్ళ మంత్రులు అవుతారు అని తెలుస్తోంది.
Also Read:MLA Roja: జబర్ధస్త్ నుంచి ఔట్.. రోజాకు మంత్రి పదవి ఖాయమైందా?