Gudivada Amarnath: ఆహ్వానమొస్తే చాలు అదే పది వేలు అనుకుంటారు. రెక్కలు గట్టుకొని వాలిపోతారు. దావోస్ వేదికగా తమ గళాన్ని వినిపిస్తారు. పెట్టుబడుల ప్రవాహం కోసం పరితపిస్తారు. రెండు రోజుల సదస్సులో రేయింబవళ్లు కష్టపడతారు. ఇప్పుడు చెప్పేదంతా ఇతర రాష్ట్రాల మంత్రుల గురించి. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురించి కాదు.

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఎందుకు వెళ్లలేదంటే మంత్రి గుడివాడ సమాధానం చిన్న పిల్లోడు చెప్పినట్టు ఉంది. మార్చిలో విశాఖలో వరల్డ్ గ్లోబల్ సమ్మిట్ ఉందట. దానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారట. రెండు రోజుల సదస్సుకు పోయేందుకు రెండు నెలల తర్వాత వచ్చే సదస్సును సాకుగా చూపడం విడ్డూరంగా లేదు. ఏపీ మంత్రి రెండు రోజులు లేకుండా అధికారులు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చేయలేరా ? అన్న ప్రశ్న సామాన్యులకు పుట్టదూ. చెబితే నమ్మేటట్టు ఉండాలి. మంత్రి మాటలు చూస్తే అలా లేవు.
అసలు దావోస్ కు ఆహ్వానమే అందలేదని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. దీంతో సుర్రమని కాలిందో ఏమో.. వెంటనే మంత్రిగారు ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వాన పత్రిక చూపించారు. మరి ఆహ్వాన పత్రిక అందినప్పుడు ఎందుకు వెళ్లలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మంత్రి సమాధానం మాత్రం నమ్మశక్యంగా లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దావోస్ వేదికగా విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు విదేశాలను ఆహ్వానించొచ్చు కదా అన్న సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాయి.

స్టేజ్ మీద డాన్సులేసే మంత్రి గుడివాడ.. దావోస్ వేదిక మీద నిలబడి పెట్టుబడులు తేలేరా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చేప చేప ఎందుకు ఎండలేదంటే గడ్డి పరక అడ్డమొచ్చిందన్న సామెత గుర్తొస్తోంది. దావోస్ నుంచి ఆహ్వానమొస్తే చాలు అక్కడ తమ గళం వినిపిద్దామని పరిగెత్తే ప్రభుత్వాలు, మంత్రులు ఉన్నారు. కానీ ఆహ్వానమొచ్చినా వెళ్లిన మంత్రి ఏపీలోనే ఉన్నారని జనం నిట్టూరుస్తున్నారు.