AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నూతన గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉభయ సభాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్నది డిసైడ్ చేయనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీ ఎన్నికలు సమీపించనున్నాయి. అందుకే ఈ బడ్జెట్ సమావేశాలను జగన్ సర్కారు కీలకంగా భావిస్తోంది. అందుకే ముఖ్యమైన ప్రకటనలకు అసెంబ్లీ సమావేశాలు వేదిక కానున్నాయి. 2023, 24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2.60 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అన్నివర్గాలను టార్గెట్ చేస్తూ.. వారికి సరైన కేటాయింపులు చేస్తూ.. వారి అభిమానాన్ని చూరగొనాలన్న లక్ష్యంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను రూపొందించారు. జనాకర్షక బడ్జెట్ గా తీర్చిదిద్దాలని గత కొన్నిరోజులుగా ఆయన కసరత్తు చేస్తున్నారు.
గత ఏడాది కంటే కేటాయింపులు పెరిగే చాన్స్ ఉంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసేలా కేటాయింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖ తరలించడం, విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభం వంటి వాటిపై స్పష్టతనిచ్చే అవకాశముంది. సీఎం జగన్ ఈ కీలకాంశాలపై అసెంబ్లీలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. తొలుత 18 వ తేదీన బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముహూర్తంగా నిర్ణయించారు. కానీ అంతకంటే ముందు.. అంటే ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టడానికి డిసైడ్ అయ్యారు. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత అసెంబ్లీకి రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశముంది.
ఈసారి కూడా సంక్షేమ తారక మంత్రాన్ని పఠిస్తున్న జగన్ ఎన్నికల్లో ఇదే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇబ్బడిముబ్బడిగా కేటాయింపులు చేస్తారని సమాచారం. ఇప్పటివరకూ నాడునేడు పథకంలో ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రాధాన్యత ఇచ్చారు. సమూల మార్పులు తీసుకొచ్చినట్టు నమ్మకంగా చెబుతున్నారు. ఈసారి మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడునేడు పథకానికి అధిక మొత్తంలో కేటాయింపులు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాల్లో కీలకమైన సామాజిక పింఛన్లను రూ.3 వేల మొత్తానికి పెంచేలా కసరత్తు చేస్తున్నారు. అందుకు ప్రత్యేక కేటాయింపులున్నట్టు సమాచారం. విద్య, వైద్యం, వ్యవసాయరంగానికి సమపాళ్లలో ప్రాధాన్యం ఇచ్చి ఆయా వర్గాలను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ అభిమతంగా తెలుస్తోంది.
మూడు రాజధానులపై ఈ సమావేశాల్లో మరింత స్పష్టతనిచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం రాజధానుల కేసు అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ నెల 28న విచారణకు రానున్న నేపథ్యంలో అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావంతో ఉంది. అయితే ఇప్పటికే రెండు, మూడు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ముందుగా సీఎం క్యాంపు ఆఫీసు తరలించే ప్రయత్నంలో ఉన్న సర్కారు సీఎం జగన్ విశాఖ నుంచి పాలనను ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. దానిపై అసెంబ్లీలో ప్రకటన చేసి కార్యాచరణ ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఎన్నికల ఏడాది కావడంతో కీలక అంశాలు, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవడానికి వైసీపీ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరి దీనిపై విపక్షాలు ఎలా ముందుకెళతాయో చూడాలి మరీ.