MIM Corporators: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పాతబస్తీని ఎంఐఎం నాయకులు అడ్డాగా మార్చేసుకున్నారా? వారి ఇలాకాలో ఎవరూ అడుగుపెట్టినా బెదిరింపులేనా? ఆఖరు అందరూ భయపడే పోలీసులను కూడా భయపెడుతున్న పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి. పాతబస్తీలో ఎంఐఐ నాయకులను ఎదురించేవారే లేరా? అసాంఘిక శక్తులకు అక్కడ అడ్డాగా ఎందుకు మారుతోంది.? ఉగ్రవాదులు.. రోహింగ్యాలు అడ్డా వేశారని.. తాము అధికారంలోకి వస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం హెచ్చరిస్తున్న పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి. పాతబస్తీలో అసలు ఎవరూ కరెంట్ బిల్లులు కట్టడం లేదని.. తాము వస్తే ఒక్కరోజులోనే సెట్ చేస్తామని బీజేపీ ఎందుకు అంటోందన్నది ప్రశ్న… కొంతమంది నాయకులు అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. బయటి వారిని, కొత్తవారిని లోనికి రానివ్వని అక్కడి కొంతమంది నేతల తీరు షాకింగ్ గా మారింది. తాజాగా పోలీసులకు సైతం వారు దమ్కీ ఇస్తున్నారు. ఎంఐఎం కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. వారిపై చర్యలు తీసుకోవడానికి స్వయంగా మంత్రి కేటీఆర్ ఆదేశించే వరకూ పోలీసులు ఎందుకు ఉపేక్షిస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. ఎంఐఎం నాయకుల దాదాగిరీకి.. వారికి అధికార పార్టీ అండ ఉందని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ పాతబస్తీలో ఇలా ఎందుకు జరుగుతోంది. ఎంఐఎం నేతల దురాగతాలను అడిగే వారు.. అడ్డుకునే వారే లేరా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిపై స్పెషల్ ఫోకస్..
– పతాహే.. మే కౌన్‌హూ!
ముషీరాబాద్‌లో నాలుగు రోజుల క్రితం భోలక్‌పూర్ కార్పొరేటర్ మహ్మద్‌గౌస్ పోలీసులపై రెచ్చిపోయారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా అక్కడ షాపులు తెరిచి ఉండడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారు.. అక్కడే ఉన్న భోలక్‌పూర్ కార్పొరేటర్ మహ్మదగౌస్ పోలీసులను దుర్భాషలాడారు. సౌ రూపాయ్ వాలా అంటూ కించపరిచారు. ‘పతాహే.. మే కౌన్‌హూ’ కార్పొరేటర్.. కార్పొరేటర్’ అంటూ పోలీసులకు దమ్కీ ఇచ్చారు. రంజాన్ టైంలో తమను ప్రశ్నించొద్దని.. మీ డ్యూటీ మీరు చేసుకోండి.. చల్‌బే చల్.. కార్పొరేటర్ చెప్పిండని మీ సార్‌కు చెప్పండి’ అంటూ వ్యాఖ్యానించాడు హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయింది.
Also Read: AP Cabinet Expansion: జగన్ కేబినెట్ లో కొత్త వారెందరు? పాత వారెందరు?
– పోలీసులపైనే జులం
పాతబస్తీలో నేతలు ఎన్ని అరాచకాలు చేసిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. చివరికి పోలీసులను కించ పరిస్తే కేటీఆర్ సీరియస్ అయ్యి యాక్షన్ తీసుకోవాలని ఆదేశించాల్సి వచ్చింది.. భోలక్‌పూర్ కార్పొరేటర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించినా.. మొదట పోలీసులు స్పందించలేదు. కానీ ఆ వీడియో పోషల్ మీడియాలో వైరల్ కావడం.. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ డ్యామేజీ కంట్రోల్‌కు ఉపక్రమించారు. పోలీసులను బెదిరించిన కార్పొరేటర్‌పై చర్య తీసుకోవాలని డీజీపీకి ట్వీట్ చేశారు. దీంతో కార్పొరేటర్ గౌస్‌ను అరెస్ట్ చేయాలని ముషీరాబాద్ పోలీసులను డీజీపీ ఆదేశించారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి మంత్రి అయిన కేటీఆర్ చెప్పే వరకూ పోలీసులు తమ గౌరవాన్ని కాపాడుకునే పరిస్థితి లేకపోవడం పాత బస్తీలో పోలీసుల ఎంత భయంగా విధులు నిర్వహిస్తున్నారో అర్థమవుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పోలీసుల పౌరుషాన్ని టీఆర్ఎస్ – ఎంఐఎం దోస్తీ దెబ్బతీస్తోందని వాళ్లు విమర్శిస్తున్నారు.
-అయినా మారని తీరు..
భోలక్‌పూర్ కార్పొరేటర్ మహ్మద్‌గౌస్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా.. ఎంఐఎం కార్పొరేటర్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. కార్పొరేటర్ అరెస్ట్ అయిన మరుసటి రోజే.. పాత బస్తీలో మరో ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. యునాని ఆస్పత్రి దగ్గర పార్కింగ్ విషయంలో పత్తర్‌గట్టీ ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫిర్యాదు అందిందని ఎస్సై సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా.. ఆ కార్పొరేటర్ మాత్రం తగ్గలేదు. ఎస్సై మాటలు పట్టించుకోకుండా.. గట్టిగట్టిగా అరుస్తూ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ ఎస్సైపై చిందులు తొక్కాడు. ఎస్సైకి దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు.
-స్పందించిన ఎంఐఎం చీఫ్, అసదుద్దీన్..
భోలక్‌పూర్ కార్పొరేటర్ వ్యవహారం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడం, ఆపై పోలీసులు కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కామెంట్ చేశారు. రేవ్ పార్టీ రిచ్ కిడ్స్ను వదిలేశారని, చట్టం పేద, ధనిక వర్గాలకు ఒకేలా వర్తించాలంటూ హైదరాబాద్ పోలీస్, మంత్రి కేటీఆర్ ట్విటర్ ట్యాగులను జత చేసి మరీ ట్వీట్ చేశారు. తమ కార్పొరేటర్లను టచ్ చేస్తే.. మీ బండారం బయట పెడతా అన్నట్లుగా సున్నిత హెచ్చరిక చేసినట్లుగా ట్వీట్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-అధికార పార్టీలకు అంటకాగుతూ..
ఎంఐఎం పార్టీ మొదటి నుంచి అధికార పార్టీలకు అంటకాగుతోందన్న విమర్శలున్నాయి. పాత బస్తీలో తమ పట్టు నిలుపుకునేందు ఉమ్మడి ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతు ఇస్తూ వస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుతో ఆ పార్టీ నాయకులు సన్నిహితంగా ఉండేవారు. దీంతో పాతబస్తీలో ఏం జరిగినా పట్టించుకోవద్దు అన్నట్లు పోలీసులు వ్యవహరిచేవారు.. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీని దూరం పెట్టి.. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి దగ్గరయ్యారు. వైఎస్సార్ అకాల మరణంతో ఆయన ముఖ్యమంత్రి అయిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ అంతే సాన్నిహిత్యం నెరిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం. తెలంగాణ వ్యతిరేకి అయిన ఉమ్మడి ఆధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఎంఐఎంతో వైరం పెట్టుకొని ఆ పార్టీనేత అక్బరుద్దీన్ ను జైలుకు పంపి తొలి స్ట్రాంగ్ సీఎం అనిపించుకున్నారు. ఇక పార్లమెంట్‌లోనూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా బీజేపీ మద్దతుతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేసింది.
-2014 నుంచి టీఆర్ఎస్తో దోస్తీ..
తెలంగాణ ఏర్పాటుకు ముందు వరకూ టీఆర్ఎస్కు దూరంగా ఉన్న ఎంఐఎం.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ను వీడి గులాబీ పార్టీకి దగ్గరయ్యింది. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఎంఐఎం దోస్తీ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17న ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేసిన టీఆర్ఎస్ శ్రేణులు.. స్వరాష్ట్రంలో విమోచన దినోత్సవం పేరు ఎత్తడమే మానేశారు. ఎవరైనా మాట్లాడితే అది నేరం అన్నట్లు గులాబీ బాస్ వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా ఎంఐఎం నాయకులు తమకు అధికార పార్టీ అండ ఉండడం.. 2018 తర్వాత హోం మంత్రి కూడా ముస్లిం వ్యక్తి, పాత బస్తీతకి చెందిన మహమూద్ అలీ కావడంతో అక్కడి నేతలు మరింత రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడడం, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడంతో ఇటు టీఆర్ఎస్కు.. అటు ఎంఐఎంకు మింగుడు పడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే తమ ఉనికే ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన ఎంఐఎం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ వస్తేనే ఎంఐఎం ఆగడాలకు చెక్ పడుతుందని.. పాతబస్తీలో ప్రశాంతత.. శాంతి భద్రతలు నెలకొంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: KCR Mark: వరి పోరుకు కేసీఆర్ మార్క్ ‘శుభంకార్డ్’ పడనుందా?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Another mim corporator misbehave to police officers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com