MLC Janga Krishnamurthy: జగన్ కు మరో భారీ షాక్

గురజాల నియోజకవర్గం నుంచి జంగా కృష్ణమూర్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో మాత్రం పార్టీ అవసరాల కోసం సీటును త్యాగం చేశారు.

Written By: Dharma, Updated On : December 30, 2023 9:17 am

Janga Krishna Murthy

Follow us on

MLC Janga Krishnamurthy: మరో బీసీ ఎమ్మెల్సీ పార్టీని వీడనున్నారా? హై కమాండ్ స్పష్టమైన సంకేతాలు పంపారా? తనకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీలో ఉండనని తేల్చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఇప్పుడు అదే బాటలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పయనిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు టిక్కెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలో కూడా చెబుతున్నారు. ఇవ్వకుంటే మాత్రం తన దారి తాను చూసుకుంటానని హెచ్చరికలు పంపుతున్నారు.

గురజాల నియోజకవర్గం నుంచి జంగా కృష్ణమూర్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో మాత్రం పార్టీ అవసరాల కోసం సీటును త్యాగం చేశారు. హై కమాండ్ కాసు మహేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపు కోసం సహకరించారు. పార్టీ అధికారంలోకి రావడంతో కృష్ణమూర్తికి తిరుగు లేదని అంతా భావించారు. రాజ్యసభ తో పాటు టీటీడీ అధ్యక్ష పదవి విషయానికి వచ్చేసరికి జంగా కృష్ణమూర్తి పేరు ప్రధానంగా వినిపించేది. కానీ చివరి నిమిషంలో మొండి చేయి చూపేవారు. ఎలాగోలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కానీ ఆ పదవితో కృష్ణమూర్తి సంతృప్తిగా లేరు. వచ్చే ఎన్నికల్లో గురజాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ అధిష్టానం నుంచి అంతగా సానుకూలత రావడం లేదు. కాసు మహేశ్వర్ రెడ్డి వైపే హై కమాండ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాడోపేడో తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

తాజాగా ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి తనను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఒక వర్గానికి మాత్రమే ప్రయోజనం కలిగేలా కాసు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇలా ఎందుకు జరుగుతుందో వైసిపి హై కమాండ్ ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్పుగా ఉన్న తనను వైసీపీ క్యాడర్ కలవడానికి ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా? అని నిలదీశారు. జిల్లాలో ఒక ట్రెండు సీట్లు మాత్రమే బీసీలకు ఇవ్వాలని నిబంధన లేదని.. గెలుపు అవకాశాన్ని బట్టి ఎన్ని సీట్లు అయినా ఇవ్వొచ్చని.. తనకు గురజాల టికెట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ తనను కాకుండా మరెవరికి సీట్ ఇచ్చిన ప్రత్యామ్నాయం చూసుకుంటానని హై కమాండ్ కు హెచ్చరిక పంపినట్టు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కాసు మహేశ్వర్ రెడ్డి కి టికెట్ ఇస్తేపార్టీలో ఉంటారా? ఉండరా? అనే చర్చకు జంగా కృష్ణమూర్తి తెర తీశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.