https://oktelugu.com/

Lok Sabha Election Results 2024: అన్నామలై ఫార్ములా.. తమిళనాడులో ఎందుకు బెడిసి కొట్టింది?

తమిళనాడు రాష్ట్రంలో 39 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ బిజెపికి కోలుకోలేని షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ లో ఈ రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు స్థానాలు బిజెపికి వస్తాయని తేలింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 5, 2024 / 11:41 AM IST

    Lok Sabha Election Results 2024

    Follow us on

    Lok Sabha Election Results 2024: రాజకీయాలన్నాకా ఓటములు, గెలుపులుంటాయి. ఎన్నికలలో విజేతలు ఉంటారు, పరాజితులూ ఉంటారు. ఐదేళ్లకోసారి మారే అధికారం కోసం జరిగే పోటీలో రసవత్తరమైన అంశాలు చోటుచేసుకుంటాయి. కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని విస్మయాన్ని పరిచయం చేస్తాయి. 2024 ఎన్నికల్లో అలాంటి ఆశ్చర్యాలు, విస్మయాలు చాలా చోటుచేసుకున్నాయి. అందులో ప్రత్యేకమైనది తమిళనాడు రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓటమి. అన్నామలై ఇండియన్ పోలీస్ సర్వీస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె ప్రభుత్వ పనితీరును ఆది నుంచి ఆయన ఎండగట్టుకుంటూ వస్తున్నారు.. ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కొద్దో గొప్పో సీట్లు బిజెపి సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఫలితాల వెల్లడి తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

    తమిళనాడు రాష్ట్రంలో 39 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ బిజెపికి కోలుకోలేని షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ లో ఈ రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు స్థానాలు బిజెపికి వస్తాయని తేలింది. కానీ , ఇండియా కూటమిలోని డీఎంకే ఈ రాష్ట్రాన్ని మొత్తం స్వీప్ చేసింది.. చివరికి పుదుచ్చేరి ప్రాంతంలోనూ డీఎంకే అభ్యర్థి విజయం సాధించారు. 2014లో ఇక్కడ రాధాకృష్ణన్ బిజెపి తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పుదుచ్చేరి స్థానాన్ని బిజెపి తిరిగి కైవసం చేసుకోలేకపోతోంది.. ధర్మపురి లో ఎన్డీఏ మిత్రపక్ష పార్టీ పట్టాలి మక్కల్ కట్చి కొంత ప్రభావం చూపించినప్పటికీ.. ఇక్కడ డీఎంకే అభ్యర్థి మణి 21,300 ఓట్ల తేడాతో విజయం సాధించారు.. కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన తమిళనాడు బిజెపి చీఫ్ అన్నామలై ఓటమి పాలయ్యారు.. వాస్తవానికి అన్నామలై కి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఆ మధ్య పాదయాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. కానీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి విరుద్ధమైన ఫలితం నమోదయింది. అన్నామలై ఓడిపోవడం పట్ల బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చారని.. కానీ ఆయన చట్టసభల్లోకి వెళ్లేందుకు ప్రజలు ఆశించిన స్థాయిలో ఆమోదం తెలపడం లేదని బిజెపి నాయకులు వాపోతున్నారు.. అన్నామలై మాత్రమే కాకుండా రామనాథపురం లోని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓడిపోయారు. మిగతా నియోజకవర్గాలలోనూ ఎన్డీఏ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.

    ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో 69.72 శాతం పోలింగ్ నమోదయింది. 2019లోనూ డీఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి 38 సీట్లు గెలుచుకుంది.. ఇక ప్రస్తుత ఎన్నికల్లో వేలూరు, తిరునల్వేలి, తేని వంటి నియోజకవర్గాలలోనూ డీఎంకే విజయం సాధించింది. తేని నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి తంగ తమిళ సెల్వన్ 2,78,825 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    ఇక తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డీఎంకే గత ఏడాది ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చింది.. ఆ తర్వాత గత ఏడాది మళ్లీ కూటమిలో చేరింది.. అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. ఐయూఎంఎల్ అభ్యర్థి నవాస్కాని చేతిలో ఏకంగా 1,66,782 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారంటే.. తమిళనాడులో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఎగ్జిట్ పోల్ అంచనాలకు భిన్నంగా డీఎంకే ప్రభుత్వం పనితీరు ఉంది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీ మరింత బలోపేతమైందని పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోంది.