AP Power Cuts: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కోతలతో సతమతమవుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో పరిశ్రమలకు ఏకంగా పవర్ హాలీడే ప్రకటించారు. పరిశ్రమలు వారంలో ఒకరోజు పాటు సెలవు పాటించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది
ఏపీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా జరగట్లేదు. ఈ సీజన్ లో వర్షాలు లేకపోవడంతో డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. వ్యవసాయ అవసరాలతో పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో విద్యుత్ వినియోగం సైతం పెరిగిపోయింది. డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోవడంతో విద్యుత్ కోతలు అనివార్యంగా మారాయి. అటు బహిరంగ మార్కెట్లో కూడా విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం మంగళవారం నుంచి సెప్టెంబర్ 15 వరకు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. విద్యుత్ సరఫరాల ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు పవర్ హాలిడే అమలు చేయాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. వైద్య సంబంధిత పరిశ్రమలతో పాటు రైస్ మిల్లులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మిగతా పరిశ్రమలు మాత్రం తప్పకుండా పవర్ హాలిడే పాటించాల్సిందే. లేకుంటే మాత్రం కఠిన చర్యలకు బాధ్యులవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత కొద్దిరోజులుగా ఈఎల్లార్ పేరుతో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గృహ అవసరాలు అవసరమైన విద్యుత్ తో పాటు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. దీనిపై ప్రజల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. వర్షాలు పడే వరకు పవర్ హాలిడే కొనసాగింపున కే ప్రభుత్వం మొగ్గుచూపింది.